Ministry of Ayush: అద్భుత ఫలితాలంటూ ఆయుర్వేద, సిద్ధ ఔషధాలను ప్రచారం చేయడం చట్టవిరుద్ధం
వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం, అలాగే వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. ఈ ప్రకటనలపై నిషేధం విధించబడిందని, వాటిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. తాము ఏ విధమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి (ఏఎస్‌యూహెచ్)మందులకు ధ్రువీకరణలను ఇవ్వలేదని ప్రకటించింది. అలాగే,ఆయా వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాల తయారీ, విక్రయాలకు కూడా ఏ ఉత్పత్తిదారు లేదా కంపెనీకి అనుమతులు మంజూరు చేయలేదని ఆయుష్ శాఖ పేర్కొంది.
ఏఎస్‌యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు పర్యవేక్షణలో వాడాలి
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ప్రకారం, ఏఎస్‌యూహెచ్ ఔషధాల తయారీ, విక్రయాలకు అనుమతులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే జారీ చేస్తాయని వివరణ ఇచ్చింది. ఏఎస్‌యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు లేదా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని సూచించింది. అభ్యంతరకర, తప్పుడు ప్రకటనలు, నకిలీ మందులపై రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి లేదా ఆయుష్ శాఖకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించింది.