'Artificial Sun' Project: కృత్రిమ సూర్యుడి దిశగా భారత్ కీలక అడుగు.. కొత్త గైరోట్రాన్‌తో ప్రయోజనాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
అపరిమిత, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో భారత్ చేపట్టిన 'కృత్రిమ సూర్యుడు' పరిశోధనల్లో మరో కీలక పురోగతి నమోదైంది. గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్)ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకామాక్-1 (ఎస్ఎస్‌టీ-1)లో అత్యంత శక్తిమంతమైన కొత్త గైరోట్రాన్ వ్యవస్థను విజయవంతంగా అనుసంధానించారు. దీంతో ఫ్యూజన్ టెక్నాలజీపై జరుగుతున్న పరిశోధనలకు మరింత ఊతం లభించనుంది. ఎస్ఎస్‌టీ-1 అంటే ఏమిటి? ఎస్ఎస్‌టీ-1 డోనట్ ఆకారంలో ఉండే ప్రయోగాత్మక ఫ్యూజన్ రియాక్టర్. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి అయ్యే ప్రక్రియను భూమిపై కృత్రిమంగా సృష్టించి,దాని ద్వారా అపారమైన శక్తిని పొందడమే ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో అత్యంత అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉండే ప్లాస్మాను నియంత్రించడం కీలకంగా మారుతుంది.
వివరాలు
కొత్త గైరోట్రాన్ ప్రత్యేకత ఏమిటి?
తాజాగా ఎస్ఎస్‌టీ-1లో ఏర్పాటు చేసిన గైరోట్రాన్ వ్యవస్థ 82.6 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, 400 కిలోవాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది.
అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్మాను వేడిచేయడం, దాన్ని నియంత్రించడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
ఇప్పటికే ఉన్న 42 గిగాహెర్ట్జ్, 500 కిలోవాట్ల గైరోట్రాన్ వ్యవస్థతో కలిసి ఇది పనిచేయనుంది. దీంతో శాస్త్రవేత్తలకు ప్రయోగాలు నిర్వహించడంలో మరింత వెసులుబాటు కలగనుంది.
వివరాలు
ప్లాస్మాను నియంత్రించడం ఎందుకు సవాలు?
సూర్యుడిలో గురుత్వాకర్షణ శక్తి అత్యంత వేడి ప్లాస్మాను నియంత్రిస్తుంది. అయితే భూమిపై ఫ్యూజన్ ప్రక్రియను సృష్టించేందుకు శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ప్లాస్మాను స్థిరంగా ఉంచుతూ, ఎక్కువసేపు నియంత్రించడమే శాస్త్రవేత్తల ముందున్న ప్రధాన సవాలు.
భారత శాస్త్రవేత్తలు ఇప్పటికే తమ ప్రయోగాల్లో సూర్యుడి కేంద్రకంలోని ఉష్ణోగ్రత కంటే కొన్ని రెట్లు అధికమైన వేడిని సాధించారు.
దాదాపు 20 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేయడం ద్వారా కీలక రికార్డు సృష్టించారు.
వివరాలు
భవిష్యత్తులో ప్రయోజనాలేంటి?
ఎస్ఎస్‌టీ-1 ప్రస్తుతం వాణిజ్యపరంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదు. ఇది పరిశోధనల కోసం మాత్రమే పనిచేస్తోంది.
కొత్త గైరోట్రాన్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్మాను నియంత్రించే అంశంపై మరింత లోతైన అధ్యయనాలు చేయడానికి అవకాశం లభిస్తుంది.
ఈ పరిశోధనల ద్వారా భవిష్యత్తులో ఫ్యూజన్ రియాక్టర్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చు.
ఫ్యూజన్ టెక్నాలజీ విజయవంతమైతే, అపారమైన స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దిశగా ప్రపంచానికి కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.