LOADING...
Dogs and AI Detect Cancer: క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం.. కుక్కలు, ఏఐతో అద్భుత ఫలితాలు
క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం.. కుక్కలు, ఏఐతో అద్భుత ఫలితాలు

Dogs and AI Detect Cancer: క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం.. కుక్కలు, ఏఐతో అద్భుత ఫలితాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనుషులకు క్యాన్సర్ ఉందని తెలిసేలోపే కుక్కలు దానిని పసిగట్టగలవా? ఈ ప్రశ్నకు "అవును" అనే సమాధానమే చెబుతోంది బెంగళూరుకు చెందిన స్టార్టప్ డాగ్నోసిస్ బయోసైన్సెస్. ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్‌లా అనిపించిన ఈ ఆలోచనకు తాజాగా ప్రచురితమైన శాస్త్రీయ అధ్యయనం బలం చేకూర్చింది. డాగ్నోసిస్ బయోసైన్సెస్ పరిశోధకులు శిక్షణ పొందిన కుక్కలను కృత్రిమ మేధ (AI) ఆధారిత విశ్లేషణ వ్యవస్థతో కలిపి పరీక్షలు నిర్వహించారు. శ్వాస నమూనాల ద్వారా పలు రకాల క్యాన్సర్లను 90 శాతానికి పైగా సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీతో గుర్తించగలిగినట్లు వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ పరిశోధనా జర్నల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురితమైంది.

వివరాలు 

90.6 శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్ గుర్తింపు 

ఈ పరిశోధనలో కర్ణాటకలోని ఆరు ఆస్పత్రుల నుంచి మొత్తం 3,275 మంది పాల్గొన్నారు. తుది దశలో 1,502 మందిపై నిర్వహించిన పరీక్షల్లో 90.8 శాతం సెన్సిటివిటీ, 91.3 శాతం స్పెసిఫిసిటీ నమోదైంది. మొదటి, రెండో దశల్లో ఉన్న ప్రారంభ స్థాయి క్యాన్సర్లను కూడా 90.6 శాతం ఖచ్చితత్వంతో గుర్తించగలిగినట్లు పరిశోధకులు తెలిపారు. అంటే ప్రతి 10 మంది క్యాన్సర్ రోగుల్లో దాదాపు 9 మందిని సరిగ్గా గుర్తించడంతో పాటు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి 10 మందిలో దాదాపు 9 మందికి క్యాన్సర్ లేదని కూడా సరిగ్గా నిర్ధారించగలిగింది.

వివరాలు 

ఎందుకు ఇది కీలకం?

భారతదేశంలో సమగ్ర క్యాన్సర్ నిర్ధారణకు సగటున రూ.20 వేల నుంచి రూ.65 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ అధిక వ్యయం కారణంగా చాలా మంది ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు. ఫలితంగా వ్యాధి ముదిరిన తర్వాతే క్యాన్సర్ బయటపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ముందస్తు స్క్రీనింగ్ చేసే ఈ సాంకేతికత అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సంప్రదాయ క్యాన్సర్ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ప్రమాద స్థాయిని ముందుగానే గుర్తించే తొలి దశ స్క్రీనింగ్ సాధనంగా దీనిని ఉపయోగించాలన్నదే తమ లక్ష్యమని డాగ్నోసిస్ ప్రతినిధి మనాల్ షకీల్ తెలిపారు.

Advertisement

వివరాలు 

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత

ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారిని గుర్తించి తదుపరి వైద్య పరీక్షలకు పంపించడమే తమ ఉద్దేశమని చెప్పారు. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని సంస్థ తెలిపింది. భారీ మౌలిక సదుపాయాలు అవసరం లేకపోవడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించవచ్చని పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఖర్చు ఎంత?

ప్రస్తుతం భారతదేశంలో క్యాన్సర్ నిర్ధారణకు రూ.20 వేల నుంచి రూ.65 వేల వరకు ఖర్చవుతుండగా, కుక్కల సహాయంతో చేసే ఈ స్క్రీనింగ్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలో దాదాపు పదో వంతు మాత్రమే ఉండే అవకాశం ఉందని డాగ్నోసిస్ ప్రతినిధి సృష్టి తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేస్తే ప్రజలకు ఉచితంగా కూడా అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ హెల్త్ మిషన్‌తో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో పైలట్ ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

వివరాలు 

పరిశోధనలో పాల్గొన్న కుక్కలు

ఈ అధ్యయనంలో మొత్తం 16 శిక్షణ పొందిన కుక్కలను ఉపయోగించారు. వీటిలో బీగిల్స్,లాబ్రడార్,లాబ్రడార్-ఇండీ మిక్స్,డచ్ షెపర్డ్-బెల్జియన్ మాలినోయిస్ మిక్స్ జాతుల కుక్కలు ఉన్నాయి. ఏ కుక్కతో పరీక్ష నిర్వహించినా ఫలితాల్లో గణనీయమైన మార్పు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ విధానంలోనూ కొంత మేర పొరపాట్లకు అవకాశం ఉంటుందని సంస్థ వెల్లడించింది. కొందరికి క్యాన్సర్ లేకపోయినా ప్రమాద సూచన వచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.

వివరాలు 

పరిశోధనలో పాల్గొన్న కుక్కలు

మరోవైపు ప్రారంభంలో పరీక్షలో గుర్తించబడని ఇద్దరికి కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అయినప్పటికీ, లక్షణాలు తీవ్రమయ్యేలోపే క్యాన్సర్‌ను గుర్తించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించగలదని డాగ్నోసిస్ భావిస్తోంది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు పెరగడంతో పాటు రోగులపై ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement