portable MRI system: భారత్‌లో తొలి పోర్టబుల్ MRI.. AIIMSలో సరికొత్త టెక్నాలజీ!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఆరోగ్య రంగంలో మరో ముందడుగు పడింది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(AIIMS) న్యూఢిల్లీలో భారత్‌లో తొలి పోర్టబుల్ MRI సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ అల్ట్రా-లో-ఫీల్డ్ డివైస్‌ను నేరుగా రోగి పడక దగ్గరకే తీసుకెళ్లి స్కాన్ చేయవచ్చు. ముఖ్యంగా ఐసీయూ,ఎమర్జెన్సీ,న్యూరోసర్జరీ వంటి కీలక పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ సాంకేతికత ఇప్పటికే న్యూరాలజీ విభాగంలో డాక్టర్ శైలేష్ గైక్వాడ్ పర్యవేక్షణలో ఉపయోగంలో ఉంది. సాధారణంగా MRI స్కానింగ్ కోసం రోగులను వేరే గదికి తరలించాల్సి వస్తుంది. కానీ తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఇది ప్రమాదకరమై ఉండొచ్చు. అలాంటి సమస్యలను ఈ పోర్టబుల్ MRI తగ్గిస్తుంది. స్ట్రోక్,గాయాలు,పిల్లల్లో న్యూరాలజికల్ సమస్యలు,ఆపరేషన్ తర్వాత పరిస్థితుల్ని త్వరగా గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.
వివరాలు
రెగ్యులర్ MRIకి రీప్లేస్మెంట్ కాదు
ఈ ప్రాజెక్ట్‌కు రేడియోసర్జరీ గ్లోబల్ లిమిటెడ్ మద్దతు ఇవ్వగా, భారత్‌లో అవసరమైన అనుమతులు కూడా పొందింది. ఇది రెగ్యులర్ MRIకి రీప్లేస్మెంట్ కాదు.. కానీ ఎమర్జెన్సీల్లో కీలకంగా పనిచేస్తుందని డాక్టర్ గైక్వాడ్ క్లారిటీ ఇచ్చారు. ఇది తక్కువ రిజల్యూషన్‌తో పని చేసినప్పటికీ, అత్యవసర సమయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా మారుతుంది. మొత్తానికి, తీవ్ర అనారోగ్య రోగులకు స్కానింగ్ ఆలస్యం సమస్యకు ఇది మంచి పరిష్కారం. ఇకపై డాక్టర్లు రోగి వద్దకే వెళ్లి తక్షణమే మెదడు చిత్రాలు తీసే అవకాశం ఉండటంతో, చికిత్స వేగం మరింత పెరగనుంది.