Loading...
Vikram-1: తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌.. 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధం.. రేపు శ్రీహరికోట నుంచి నింగిలోకి
రేపు శ్రీహరికోట నుంచి నింగిలోకి

Vikram-1: తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌.. 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధం.. రేపు శ్రీహరికోట నుంచి నింగిలోకి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దేశీయ ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ 'విక్రమ్-1' తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన ఈ రాకెట్‌ను ఈ నెల 18వ తేదీ ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. ఈ తొలి ప్రయోగానికి 'మిషన్‌ ఆగమన్‌' అనే పేరును నిర్ణయించారు. దాదాపు ఏడు అంతస్తుల భవనం ఎత్తుతో ఉండే విక్రమ్-1 రాకెట్‌ను అత్యాధునిక కార్బన్‌ కాంపోజిట్‌ నిర్మాణంతో రూపొందించారు.

వివరాలు 

ప్రయోగానికి సంబంధించిన కీలక ఏర్పాట్లు పూర్తి 

బహుళ దశల వ్యవస్థ కలిగిన ఈ రాకెట్‌లో స్కైరూట్‌ స్వయంగా అభివృద్ధి చేసిన ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌, 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్లు, ఘన ఇంధన ఆధారిత రాకెట్‌ బూస్టర్లను అమర్చారు.

సుమారు 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ నిమ్న కక్ష్య (Low Earth Orbit)లో ప్రవేశపెట్టే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు.

ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన కీలక ఏర్పాట్లు పూర్తయ్యాయి.

లాంచ్‌ప్యాడ్‌పై రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగా, తుదిదశ సాంకేతిక తనిఖీలను కూడా అధికారులు ముగించారు.

దీంతో నిర్ణయించిన సమయానికే ప్రయోగం నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

వివరాలు 

ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే ప్రజలకు కూడా అవకాశం

ఈ మిషన్‌ ద్వారా గ్రహాస్పేస్‌, కాస్మోసెర్వ్‌, డీక్యూబ్డ్‌ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ పేలోడ్లతో పాటు స్కైరూట్‌ రూపొందించిన 'స్కోప్‌' పేలోడ్‌ను కూడా రోదసిలోకి పంపనున్నారు.

అంతేకాకుండా కాస్మోస్‌ డైమండ్స్‌ రూపొందించిన 'కాస్మిక్‌ బ్లూమ్‌' పేరుతో ప్రత్యేక కళాకృతిని, మరో మైక్రో ఆర్ట్‌ పీస్‌ను కూడా ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.

ఈ చారిత్రక ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే ప్రజలకు కూడా అవకాశం కల్పించారు.

శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్‌ వ్యూ గ్యాలరీ నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని చూసేందుకు ఆసక్తి ఉన్న వారు స్పేస్‌ థీమ్‌ పార్క్‌, శ్రీహరికోట అధికారిక వెబ్‌సైట్‌లో(https:/vg.shar.gov.in/ VSCREGISTRATION/index.jsp) ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ADVERTISEMENT