SMS scams: ఎసెమ్మెస్ స్కామ్‌ల మోత.. ఆరు నెలల్లోనే 146% పెరిగిన సైబర్ మోసాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎసెమ్మెస్ (SMS) ఆధారంగా జరిగే సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2026 తొలి అర్ధభాగంలో ఎసెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలు 146 శాతం పెరిగినట్లు బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో మొబైల్ ఫ్రాడ్ సెషన్లు కూడా 67 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. బయోక్యాచ్ విశ్లేషణ ప్రకారం,ఐఓఎస్ (iOS) పరికరాల్లో నమోదైన మొబైల్ మోసాలు 86శాతం పెరగగా, ఆండ్రాయిడ్ (Android) పరికరాల్లో ఇవి 35 శాతం అధికమయ్యాయి. మరోవైపు వెబ్ బ్రౌజర్‌ల ద్వారా జరిగే మోసాలు మాత్రం 10 శాతం తగ్గాయి. ఈ గణాంకాలు చూస్తే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం కంప్యూటర్ల కంటే మొబైల్ ఫోన్లనే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
మోసాల విలువ కూడా భారీగా పెరుగుతోంది
మోసాల సంఖ్య మాత్రమే కాకుండా, వాటి ద్వారా కాజేస్తున్న డబ్బు కూడా గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది.
అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే రెట్టింపయ్యాయి.
ఒక్కో మోసంలో బదిలీ అవుతున్న సగటు మొత్తం కూడా 1.7 రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో మోసపూరిత కాల్స్, ఫ్రాడ్ సెషన్ల వ్యవధి తగ్గడం గమనార్హం.
అంటే నేరగాళ్లు తక్కువ సమయంలోనే బాధితుల నుంచి డబ్బు కాజేసే విధానాలను మరింత సమర్థంగా అమలు చేస్తున్నారని నివేదిక విశ్లేషించింది.
వివరాలు
లక్షల సంఖ్యలో మ్యూల్ అకౌంట్లు గుర్తింపు
2025లో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 700కు పైగా శాఖల్లో 8.5 లక్షలకుపైగా 'మ్యూల్ అకౌంట్లు' గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది.
అలాగే సైబర్ మోసాలకు సంబంధించి రూ.22,496 కోట్ల విలువైన ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొంది.
అదేవిధంగా 26.48 లక్షల మ్యూల్ అకౌంట్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.
అనుమానితుల రిజిస్ట్రీ (Suspect Registry) సహాయంతో రూ.9,055 కోట్ల విలువైన మోసాలను ముందుగానే అడ్డుకున్నట్లు కూడా వెల్లడించింది.
వివరాలు
డిజిటల్ చెల్లింపులతో పెరిగిన ప్రమాదం
యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆన్‌లైన్ పెట్టుబడుల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతుండటంతో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారిందని బయోక్యాచ్ పేర్కొంది.
అయితే బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), చట్ట అమలు సంస్థలు సమన్వయంతో పనిచేస్తుండటంతో మోసాలను ముందుగానే గుర్తించే సామర్థ్యం క్రమంగా మెరుగుపడుతోందని నివేదిక వెల్లడించింది.