LOADING...
Blue Origin: స్పేస్ యాత్రతో చరిత్ర సృష్టించిన 80 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అర్విందర్ బహల్ ! 
అంతరిక్షంలోకి 80ఏళ్ల భారతీయుడు.. ఎవరీ అర్విందర్ సింగ్ బహల్..

Blue Origin: స్పేస్ యాత్రతో చరిత్ర సృష్టించిన 80 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అర్విందర్ బహల్ ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రాలో జన్మించి, ప్రస్తుతం అమెరికా పౌరుడిగా జీవిస్తున్న 80 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త అర్విందర్ సింగ్ బహల్ అద్భుతమైన చరిత్రను సృష్టించారు. జెఫ్ బెజోస్ కంపెనీ 'బ్లూ ఆరిజిన్' నిర్వహించిన ఎన్‌ఎస్-34 మిషన్ ద్వారా ఆదివారం ఉదయం ఆయన అంతరిక్షపు అంచుల వరకూ ప్రయాణించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. టెక్సాస్‌లోని 'లాంచ్ సైట్ వన్' నుంచి ఉదయం 7:30స్థానిక సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) ఈ ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. బ్లూ ఒరిజిన్ చరిత్రలో ఇది 14వ మానవ అంతరిక్ష యానం, మొత్తం 34వ మిషన్ కావడం గమనార్హం.

వివరాలు 

అగ్రా నుంచి అంతరిక్షపు అంచుల దాకా... 

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన బహల్ జీవితం అంతా సాహసయాత్రలే. ఆయన ప్రపంచంలోని ప్రతి దేశాన్నీ సందర్శించారు.అది కూడా సాధారణంగా కాదు...ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లాంటి అతి కష్టతరమైన ప్రదేశాలకు కూడా వెళ్లారు. అంతేకాదు,ఎవ‌రెస్ట్ పర్వతంపై నుంచి స్కైడైవింగ్ చేయడం,ఈజిప్టులోని గిజా పిరమిడ్ల పైనుంచి దూకడం వంటి విశేషాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. బ్లూ ఒరిజిన్ తెలిపిన వివరాల ప్రకారం.."అర్వి (Arvi)అనే పేరుతో పిలవబడే బహల్ అగ్రాలో జన్మించారు.పుట్టుకతో భారతీయుడు అయిన ఆయన ప్రస్తుతం అమెరికా పౌరుడు.ఆయన ఒక ప్రయాణ ప్రియుడే కాకుండా అసాధారణ సాహసాలను సాధించేందుకు ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలోని ప్రతీ దేశాన్నిచూసిన అరుదైన వ్యక్తుల్లో అయన ఒకరు.ఆయనకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ ఉంది,హెలికాప్టర్లను కూడా నడిపే సామర్థ్యం ఉంది."

వివరాలు 

బహల్ తో పాటు అంతరిక్షంలోకి వెళ్లినవారెవరు? 

1975లో స్థాపించిన బహల్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన వ్యాపారంలోనూ, ప్రయాణాల్లోనూ నిత్యం కొత్త కొలమానాలను ఏర్పరుస్తున్నారు. ఇప్పుడు బ్లూ ఒరిజిన్‌కి చెందిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా ఆయన చేపట్టిన ఈ అంతరిక్ష యాత్ర ఆ సాహసాల్ని ఆకాశంలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్‌లో బహల్‌తో పాటు ఇంకా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో టర్కీకి చెందిన వ్యాపారవేత్త గోఖాన్ ఎర్డెమ్,ప్యూర్టో రికోకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణురాలు,ఎమ్మీ అవార్డు విజేత డెబోరా మార్టొరెల్,ఇంగ్లండ్‌కు చెందిన సేవాకర్త లయోనెల్ పిచ్‌ఫోర్డ్,గతంలో NS-28 మిషన్‌లో పాల్గొన్న J.D. రస్సెల్, అలాగే గ్రెనడాకు చెందిన WTOకు మాజీ రాయబారి జస్టిన్ సన్ కూడా ఉన్నారు.

వివరాలు 

బహల్ తో పాటు అంతరిక్షంలోకి వెళ్లినవారెవరు? 

జస్టిన్ సన్ 2021లో స్పేస్‌కు వెళ్లేందుకు 28 మిలియన్ డాలర్ల బిడ్ పెట్టి వార్తల్లో నిలిచారు. ఆ డబ్బుతో 19 స్పేస్ చారిటీలను ప్రోత్సహించారు. ఈ ప్రయాణంలో పాల్గొన్న డెబోరా మార్టొరెల్, వాతావరణ నిపుణురాలిగా భూమిని దాటి అంతరిక్షం చూడగలిగిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. అంతరిక్ష పర్యటనను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో బ్లూ ఒరిజిన్ పనిచేస్తోందని ఇది మరోసారి స్పష్టం చేసింది.

వివరాలు 

బ్లూ ఒరిజిన్‌కు పెరుగుతున్న ఆదరణ 

ఈ యాత్ర సుమారు 10 నుండి 11 నిమిషాల పాటు సాగింది. ఈ మిషన్‌తో బ్లూ ఒరిజిన్ ఇప్పటివరకు 70 మందిని కార్మన్ లైన్ (అంతరిక్ష సరిహద్దుగా గుర్తించబడే గీత) దాటి స్పేస్‌కి తీసుకెళ్లింది. ఉదయం 7:30కి ప్రారంభమైన ప్రయాణానికి అర్ధగంట ముందు నుంచే లైవ్ స్ట్రీమింగ్ మొదలై, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన ఈ బ్లూ ఒరిజిన్ సంస్థ, ఎవరైనా తాము కలలు కనే అంతరిక్షాన్ని చేరుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా కృషి చేస్తోంది. తాజాగా బహల్ చేసిన యాత్ర, ఆ కలల్ని నిజం చేస్తూ ముందుకు సాగుతోంది.