LOADING...
Instagram Hashtags: హ్యాష్‌ట్యాగ్‌లపై ఇన్‌స్టాగ్రామ్‌ పరిమితి.. రీల్స్‌,పోస్టులకు ఇక ఐదు హ్యాష్‌ట్యాగ్‌లే..
రీల్స్‌,పోస్టులకు ఇక ఐదు హ్యాష్‌ట్యాగ్‌లే..

Instagram Hashtags: హ్యాష్‌ట్యాగ్‌లపై ఇన్‌స్టాగ్రామ్‌ పరిమితి.. రీల్స్‌,పోస్టులకు ఇక ఐదు హ్యాష్‌ట్యాగ్‌లే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రీచ్‌ సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు రీల్స్‌, పోస్టుల్లో అవసరానికి మించి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తున్నారు. కంటెంట్‌కు సంబంధం లేకపోయినా ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించడం ద్వారా తమ పోస్ట్‌ మరింత మందికి చేరుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితులు విధిస్తూ కొత్త మార్పులను ప్రకటించింది. ఇకపై రీల్స్‌ అయినా, సాధారణ పోస్టులైనా గరిష్ఠంగా ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

వివరాలు 

అల్గారిథమ్‌ ద్వారా కంటెంట్‌ సిఫారసులు

కంటెంట్‌ను సులభంగా కనుగొనేందుకు 2011లో ఇన్‌స్టాగ్రామ్‌ తొలిసారిగా హ్యాష్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టింది. టాపిక్‌ ఆధారిత సెర్చ్‌ను మెరుగుపరచడం, అల్గారిథమ్‌ ద్వారా కంటెంట్‌ సిఫారసులు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కో పోస్ట్‌కు గరిష్ఠంగా 30 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించే వెసులుబాటు ఉండేది. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, ట్రెండింగ్‌లో ఉన్న కానీ కంటెంట్‌కు సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను కొందరు జోడిస్తుండటంతో, వాటిపై నియంత్రణ అవసరమని ఇన్‌స్టాగ్రామ్‌ భావించింది.

వివరాలు 

ఐదు హ్యాష్‌ట్యాగ్‌లకే అనుమతి

ఈ నేపథ్యంలో ఇకపై ఐదు హ్యాష్‌ట్యాగ్‌లకే అనుమతి ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా ఉపయోగించే జనరిక్‌ హ్యాష్‌ట్యాగ్‌లకన్నా, కంటెంట్‌కు నేరుగా సంబంధించిన టార్గెటెడ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను వాడడం ఎక్కువగా ప్రయోజనం ఇస్తుందని కంటెంట్‌ క్రియేటర్లకు సూచించింది. ఉదాహరణకు బ్యూటీకి సంబంధించిన కంటెంట్‌ పోస్ట్‌ చేస్తే, ఆ విభాగానికి సరిపడే హ్యాష్‌ట్యాగ్‌లనే వినియోగించాలని తెలిపింది. రీల్స్‌, #ఎక్స్‌ప్లోర్‌ వంటి సాధారణ హ్యాష్‌ట్యాగ్‌ల వల్ల ప్రత్యేకమైన లాభం ఉండదని కూడా స్పష్టం చేసింది.అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌కు రీచ్‌ లేదా విజిబిలిటీ రావడానికి హ్యాష్‌ట్యాగ్‌లే ప్రధాన ప్రమాణం కాదని ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మొస్సేరి వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement