Interestellar comet: ఈ రోజు ఆకాశంలో అరుదైన ఘటన.. భూమి వైపు దూసుకొస్తున్నగ్రహాంతర తోకచుక్క.. ఎలా చూడాలో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మన సౌర వ్యవస్థకు బయట నుంచి వచ్చిన అరుదైన తోకచుక్క 3I/ATLAS ఈ రోజు భూమికి అత్యంత సమీపంగా వస్తోంది. ఇది సాధారణ తోకచుక్క కాదు. మన సౌరవ్యవస్థకు చెందని,దూరమైన మరో నక్షత్ర మండలంలో ఏర్పడిన గ్రహాంతర తోకచుక్కగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈకారణంగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు,ఖగోళ శాస్త్రవేత్తలు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈతోకచుక్కను మొదటగా 2025 జూన్‌లో చిలీలో ఉన్న ATLAS సర్వే టెలిస్కోప్ గుర్తించింది. కొన్నివారాల పరిశీలన తర్వాత దీని వేగం,దిశ సాధారణ తోకచుక్కలకంటే భిన్నంగా ఉండటంతో ఇది గ్రహాంతర వస్తువుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటివరకు ఇలాంటివి కేవలం రెండు మాత్రమే కనిపించాయి. 2017లో గుర్తించిన 1I/ఓమువామువా, 2019లో దర్శనమిచ్చిన 2I/బోరిసోవ్ మాత్రమే ఇందుకు ముందు ఉదాహరణలు.
వివరాలు
3I/ATLAS మాత్రం పూర్తిగా భిన్నం
తోకచుక్క అంటే మంచు, ధూళి, వాయువుల మిశ్రమం. సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ వేడి పెరిగి, దీర్ఘమైన తోక ఏర్పడుతుంది. సాధారణంగా చాలా తోకచుక్కలు మన సౌరవ్యవస్థలోని కైపర్ బెల్ట్ లేదా దూరంలోని ఊర్ట్ క్లౌడ్ నుంచి వస్తాయి. కానీ 3I/ATLAS మాత్రం పూర్తిగా భిన్నం.ఇది మన సౌరవ్యవస్థకు బయట పుట్టి, ఇప్పుడు కేవలం దూసుకెళ్తోంది. ఒకసారి వెళ్లిపోయాక మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అందుకే దీన్ని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు చాలా విలువైన అవకాశం. ఈ తోకచుక్క ఈ రోజు అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 1 గంటలకు (భారత కాలమానం ఉదయం సుమారు 11:30కి) భూమికి అత్యంత సమీపంగా వస్తుంది.
వివరాలు
భూమికి సుమారు 270 మిలియన్ కిలోమీటర్ల దూరంలో..
అయితే ఇది భూమికి సుమారు 270 మిలియన్ కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కంటితో గానీ, సాధారణ బైనాక్యులర్లతో గానీ చూడటం కష్టం. దీన్ని చూడాలంటే తప్పనిసరిగా టెలిస్కోప్ అవసరం.ఆకాశ పరిశీలన యాప్స్ ఉపయోగించి ఇది ఆకాశంలో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. నేరుగా చూడలేని వారికి ఆన్‌లైన్‌లో కూడా అవకాశం ఉంది. ది వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ సంస్థ ఈ తోకచుక్కను లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఇటలీలోని మాంచియానో ప్రాంతంలో ఉన్న టెలిస్కోపుల నుంచి ఈ దృశ్యాలను ప్రసారం చేస్తారు. ఈ ప్రసారం డిసెంబర్ 18 రాత్రి 11 గంటలకు(భారత కాలమానం డిసెంబర్ 19 తెల్లవారుజామున 4:30కి) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే వాతావరణ పరిస్థితులపై సమయం మారే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.