చంద్రుడికి మరింత చేరువలో చంద్రయాన్-3: కీలక ఘట్టం పూర్తి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, భూమి కక్ష్యను దాటివేసి ట్రాన్స్ లూనార్ ఆర్బిటార్ లోకి ప్రవేశించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు వెల్లడి చేసారు. అంటే చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళడానికి మరికొంత సమయం పట్టనుందని సమాచారం. ఇస్రో శాస్త్రవేత్తల అంచనా ప్రకారంఆగస్టు 5వ తేదీన చంద్రయాన్-3, చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళనుంది. ట్రాన్స్ లూనార్ ఆర్బిటార్ నుండి చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని అక్కడి నుండి నెమ్మదిగా చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ కానుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం, ఆగస్టు 23 లేదా 24తేదీల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండ్ కానుంది.
614కోట్ల ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్
చంద్రయాన్-3 ప్రయోగంలో ల్యాండర్, రోవర్, ప్రొపుల్షన్ మాడ్యుల్ ఉన్నాయి. చంద్రయాన్-2 ఫెయిలైన తర్వాత అందులోని లోపాలను సవరించుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రయాన్-3 ప్రయోగం కోసం 614కోట్ల ఖర్చు అయ్యింది. చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి మీద సురక్షితంగా ల్యాండ్ అయితే భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద సూర్యకాంతి పడని కారణంగా చీకటిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ ప్రాంతంలోని పదార్థాలను పరిశీలిస్తే సౌరకుటుంబం తొలిరోజుల గురించి తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.