LOADING...
NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం
నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం

NISAR satellite: నవంబర్ 7 నుంచి నిసార్ ఉపగ్రహం సేవలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మెన్ ప్రకటించిన ప్రకారం,భారత్-అమెరికా సంయుక్త అంతరిక్ష ఉపగ్రహం నిసార్ (NISAR) నవంబర్ 7న పూర్తిగా కార్యకలాపాలకు సిద్ధమవుతుంది. ఈ ఉపగ్రహాన్ని జూలై 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు. సుమారు 2,400 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలో ఎల్-బాండ్,ఎస్-బాండ్ రాడార్ వ్యవస్థలు అమర్చచారు. ఇవి మేఘాల గుండా కూడా భూమి మీద జరిగే మార్పులను స్పష్టంగా గుర్తించగలవు. పంటల పెరుగుదల,నేలలోని తేమ స్థాయి,అరణ్యాలు,మంచు పొరల మార్పులు,భూభాగం కదిలే పరిస్థితులు వంటి అంశాలను నిసార్ ఉపగ్రహం నిరంతరం పరిశీలిస్తుంది. ముఖ్యంగా వరదలు,భూకంపాలు, నేలచరియలు వంటి సహజ విపత్తులను ముందుగానే గుర్తించడానికి, పరిశోధకులు మరింత ఖచ్చితమైన డేటా సేకరించడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.

వివరాలు 

ఈ స్పేస్ స్టేషన్‌లో గరిష్ఠంగా 6 మంది వ్యోమగాములు

ఈ ప్రాజెక్టు ఇస్రో,నాసా సంయుక్త సహకారంతో అమలు అవుతున్న ముఖ్యమైన అంతరిక్ష మిషన్. ఉపగ్రహం తయారీ, ప్రయోగం, నిర్వహణ వంటి బాధ్యతల్లో ఇస్రో ముఖ్యపాత్ర పోషించగా, రాడార్ టెక్నాలజీ, అధునాతన డేటా ప్రాసెసింగ్ పరికరాలను నాసా అందించింది. ఈ సహకారం ద్వారా అంతరిక్ష పరిశోధన రంగంలో రెండు దేశాల మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఇక మరోవైపు, గగనయాన్ మిషన్లో భాగంగా మొదటి మానవ రహిత ప్రయోగాన్ని జనవరి 2026లో నిర్వహించే యోచనలో ఇస్రో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే భారత స్వంత అంతరిక్ష కేంద్రం(Bhartiya Antariksh Station) తొలి మాడ్యూల్‌ను 2028 నాటికి అంతరిక్షంలో ప్రవేశపెట్టే ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ స్పేస్ స్టేషన్‌లో గరిష్ఠంగా 6 మంది వ్యోమగాములు ఉండగలరు.