ISRO: ఆదిత్య-ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విజయవంతం
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది. ఆదిత్య -ఎల్ 1 ను నిర్ధేశిత భూ కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాంట్ నెట్ వర్క్ నుంచి తొలి భూ కక్ష్య పెంపు విన్యాస ప్రక్రియను చేపట్టినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్ 1 రాకెట్ 245× 22,459 కి. మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకుందని, రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది.
సౌర రేణువులు, సౌర జ్వాలలు గురించి పరిశోధనలు
ఆదిత్య-ఎల్1' ఉపగ్రహంతో పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక శనివారం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టారు. 16రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత భూమికి 15లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో వెల్లడించింది. సౌర రేణువులు, సౌర జ్వాలలు, అక్కడి వాతావరణం గురించి ఈ మిషన్ పరిశోధనలు చేయనుంది.