ISRO: భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం
అత్యంత క్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సవాల్‌గా తీసుకొని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో చంద్రయాన్-3ను దిగ్విజయంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఇస్రో గగన్‌యాన్‌పై దృష్టి సారించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు. అంతరిక్షంలో అనేక ప్రయోగాలను చేపట్టబోతున్నామని, స్పేస్ స్టేషన్, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవ సహిత అంతరిక్ష నౌక వంటివి ఆ జాబితాలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. స్పేస్ స్టేషన్ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో పరిశీలిస్తున్నామని సోమనాథ్ తెలిపారు.
20-25 ఏళ్లలో స్పేస్ స్టేషన్ నిర్మాణం జరగొచ్చు : సోమనాథ్
స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళిక రచిస్తున్నామని, రోబోటిక్ ఆపరేషన్‌తో ఆ ప్రక్రియను ప్రారంభిస్తామని సోమనాథ్ చెప్పారు. అదే సాధ్యమైతే రాబోయే 20-25 ఏళ్లలో స్పేస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ సహిత అన్వేషణ, స్పేస్ ప్లైట్ రూపకల్పన కూడా ఇస్రో అజెండాలో ఉందని, అదే సాధ్యమైతే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే.