LVM3-M5: మరో మైలురాయికి చేరువలో ఇస్రో.. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం నేడు అంతరిక్షంలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లగల 'LVM3-M5' రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం (నవంబర్ 2) సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ మిషన్ మొత్తం 25 గంటలు 30 నిమిషాలు కొనసాగనుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. 4,410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం CMS-03ను ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది.
Details
CMS-03 మిషన్ విశేషాలు
CMS-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత బరువైన భారతీయ ఉపగ్రహంగా గుర్తింపు పొందింది. ఈ ఉపగ్రహాన్ని దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3-M5) ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా భారత భూభాగాలు, సముద్ర ప్రాంతాలకు అవసరమైన కమ్యూనికేషన్ సేవలు అందిస్తారు. ముఖ్యంగా భారత నావికాదళానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అంతేకాక, ఈ ఉపగ్రహం హై క్యాపాసిటీ బ్యాండ్‌విడ్త్, రిమోట్ ఏరియాలకు డిజిటల్ కనెక్టివిటీ వంటి సేవలను అందిస్తుంది.
Details
'బాహుబలి రాకెట్' శక్తి
LVM3-M5 రాకెట్‌ను పూర్తిగా అసెంబుల్ చేసి ఉపగ్రహంతో అనుసంధానం పూర్తి చేసినట్లు ఇస్రో శనివారం (నవంబర్ 1) ప్రకటించింది. 43.5 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ 4,000 కిలోల వరకు GTO పేలోడ్‌లు, 8,000 కిలోల వరకు తక్కువ భూమి కక్ష్య పేలోడ్‌లను మోసుకెళ్లగలదు. ఈ అధిక సామర్థ్యంతో దీనికి 'బాహుబలి రాకెట్' అనే బిరుదు లభించింది.
Details
రూ.500 కోట్ల భారీ వ్యయం
ఈ మిషన్‌పై సుమారు రూ. 500 కోట్ల వ్యయం అవుతోంది. ప్రయోగం ప్రారంభమైన 16 నిమిషాల తర్వాత ఉపగ్రహం తన నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇది పూర్తిగా 'మేక్ ఇన్ ఇండియా' ఆవిష్కరణ కింద అభివృద్ధి చేశారు. ఈ రాకెట్‌ను రాబోయే 'గగన్‌యాన్' మిషన్ లో కూడా వినియోగించనున్నారు. ఇస్రో తాజా ఈ ప్రయత్నం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెబుతుంది. ఈ మిషన్ విజయవంతమైతే, దేశం అంతరిక్ష రంగంలో మరొక సువర్ణ అధ్యాయం సృష్టించనుంది.