Loading...
ISRO NVS-03 Satellite: GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ మరో అడుగు..నేటి రాత్రి 11:51 గంటలకు నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
నేటి రాత్రి 11:51 గంటలకు నింగిలోకి NVS-03 ఉపగ్రహం!

ISRO NVS-03 Satellite: GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ మరో అడుగు..నేటి రాత్రి 11:51 గంటలకు నింగిలోకి NVS-03 ఉపగ్రహం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నేడు (అక్టోబర్ 30) రాత్రి 11:51 గంటలకు NVS-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F18 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

వివరాలు 

నావిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలకు పరిష్కారం

అమెరికాకు చెందిన GPS నావిగేషన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా భారత్ స్వదేశీ సాంకేతికతతో నావిక్ (NavIC) వ్యవస్థను అభివృద్ధి చేసింది.

అయితే ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిదిద్ది, మరింత కచ్చితమైన లొకేషన్ సేవలను అందించడంపై ఇస్రో దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగానే NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహంలో అధునాతన రూబిడియం అటామిక్ క్లాక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అహ్మదాబాద్‌లోని ఇస్రో కేంద్రం ఈ గడియారాన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది.

ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థల్లో సమయాన్ని అత్యంత కచ్చితంగా లెక్కించడం చాలా ముఖ్యం.

ఈ నేపథ్యంలో రూబిడియం అటామిక్ క్లాక్ ఉపగ్రహం ద్వారా అందే స్థాన సమాచారంలో కచ్చితత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.

వివరాలు 

2,232 కిలోల బరువు.. 12 ఏళ్ల పాటు సేవలు

NVS-03 ఉపగ్రహం మొత్తం 2,232 కిలోల బరువు కలిగి ఉంది. దీని సేవా కాలం సుమారు 12 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సేవలు అనేక రంగాలకు ఉపయోగపడనున్నాయి.

ముఖ్యంగా ప్రజలకు కచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని అందించడంతో పాటు విపత్తుల నిర్వహణలోనూ కీలకంగా మారనున్నాయి.

రైల్వే రవాణా వ్యవస్థ, రక్షణ రంగంలో భద్రతాపరమైన అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగపడనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ప్రయోగానికి తుది ఏర్పాట్లు పూర్తి

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి NVS-03 ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఇస్రో వెల్లడించింది.

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ప్రయోగానికి సంబంధించిన చివరి దశ సన్నాహాల్లో ఉన్నారు.

నిర్ణీత సమయానికి GSLV-F18 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు.

NVS-03 ఉపగ్రహం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరితే భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది.

GPS వంటి విదేశీ వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ, దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్ సేవలను విస్తరించేందుకు ఈ ప్రయోగం మరో ముందడుగుగా నిలవనుంది.

ADVERTISEMENT