Bahubali LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రైవేట్ చేతుల్లోకి.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 విజయానికి ప్రధాన బలంగా నిలిచిన ఇస్రో భారీ రాకెట్ ఎల్‌వీఎమ్3 (లాంచ్ వెహికల్ మార్క్-3) సాంకేతికతతో పాటు దాని తయారీ, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ సంస్థ ఇన్-స్పేస్ ఇందుకోసం అధికారికంగా ఆసక్తి వ్యక్తీకరణ (EOI) పత్రాలను ఆహ్వానించింది. ఇప్పటికే చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రైవేట్ రంగానికి అప్పగించిన ప్రభుత్వం.. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఎల్‌వీఎమ్3ను కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది.
వివరాలు
ఎల్‌వీఎమ్3ని 'బాహుబలి రాకెట్'గా పిలుస్తారు
భారీ బరువులను అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యం కారణంగా ఎల్‌వీఎమ్3ను 'బాహుబలి రాకెట్'గా పిలుస్తారు. మూడు దశలతో కూడిన ఈ రాకెట్ ద్వారా ఇస్రో ఎన్నో స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతేకాదు, వన్‌వెబ్ ఉపగ్రహాల ప్రయోగంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లోనూ భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. భవిష్యత్తులో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లోనూ ప్రత్యేకంగా రూపొందించిన ఎల్‌వీఎమ్3 వెర్షన్‌ను ఉపయోగించనున్నారు.
వివరాలు
గ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగే అవకాశం
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఇస్రోపై ఉండే సాధారణ ఉత్పత్తి, ప్రయోగాల బాధ్యతలను తగ్గించడం. దీంతో శాస్త్రవేత్తలు గగన్‌యాన్, చంద్రయాన్ 4, చంద్రయాన్-5తో పాటు శుక్ర గ్రహ యాత్ర వంటి అత్యాధునిక, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది. మరోవైపు, ప్రపంచ కమర్షియల్ స్పేస్ మార్కెట్‌లో భారతదేశ వాటాను పెంచేందుకు కూడా ఈ చర్య దోహదపడనుంది. ఎల్‌వీఎమ్3 తయారీ,మార్కెటింగ్ బాధ్యతలు దక్కించుకునే కంపెనీలకు ఇస్రో ప్రత్యేక సాంకేతిక సహకారం అందించనుంది. మొత్తం 42 నెలల పాటు లేదా రెండు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించే వరకు అవసరమైన సాంకేతిక మద్దతు, మార్గదర్శకత్వాన్ని ఇస్రో అందిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో పాల్గొనే భారతీయ కంపెనీలకు ప్రభుత్వం పలు కఠిన అర్హతలను నిర్దేశించింది.
వివరాలు
సంస్థ మార్కెట్ విలువ కనీసం రూ.2,000 కోట్లకు తక్కువ కాకూడదు
సంబంధిత సంస్థ కనీసం ఏడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. అంతరిక్ష లేదా ఏరోస్పేస్ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. గత ఐదేళ్లలో ఏవైనా మూడు సంవత్సరాల సగటు వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లకు మించి ఉండాలి. లేదంటే ఆ సంస్థ మార్కెట్ విలువ కనీసం రూ.2,000 కోట్లకు తక్కువ కాకూడదు. ఈ ప్రణాళిక విజయవంతమైతే భారీ రాకెట్ల తయారీ, ప్రయోగాల అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత ప్రైవేట్ కంపెనీలు కీలక శక్తిగా ఎదిగే అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో భారత్ ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించడంతో పాటు, ఇస్రో పరిశోధనల వేగం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.