LOADING...
Jeff Bezos: జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ
జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ

Jeff Bezos: జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే దిశగా ప్రపంచ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక చర్యలు చేపడుతోంది. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ,ఆటోమేషన్‌పై దృష్టి పెట్టిన ఆ సంస్థ.. ఇప్పుడు మరింత ముందడుగు వేయడానికి సిద్ధమైంది. సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ ఈ క్రమంలో మరో పెద్ద ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంస్థలను కొనుగోలు చేసి,వాటి గిడ్డంగులు,ఫ్యాక్టరీల్లో మానవ శ్రమకు బదులుగా పూర్తిగా ఏఐ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళిక కోసం సుమారు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9 లక్షల కోట్లు) సమీకరించేందుకు ఆయన పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

తక్కువ ఖర్చుతో,తక్కువ సిబ్బంది

డిఫెన్స్ తయారీ, ఏరోస్పేస్, చిప్ తయారీ రంగాలకు చెందిన కంపెనీలను స్వాధీనం చేసుకుని, వాటిలో ఆధునిక ఏఐ సాంకేతికతను విస్తరించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. దీంతో ఆ కంపెనీల పనితీరు మెరుగుపడటంతో పాటు, గిడ్డంగులు,ఉత్పత్తి ప్రక్రియల్లో కార్మికులపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రణాళిక విజయవంతమైతే తక్కువ ఖర్చుతో,తక్కువ సిబ్బందితో భారీ స్థాయిలో ఉత్పత్తిని నిర్వహించగల ఏఐ వ్యవస్థలు అన్ని గోదాములు,ఫ్యాక్టరీల్లో అమలులోకి రావచ్చు. వస్తువుల రూపకల్పన నుంచి తయారీ వరకు మానవ వనరుల ఖర్చును గణనీయంగా తగ్గించుకునే వీలుంటుంది. గతంలో ఇంజినీర్లు, కార్మికులు నిర్వహించిన పనులను ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఆధారిత యంత్రాలు మరింత వేగంగా పూర్తి చేసే స్థాయికి టెక్నాలజీ చేరుతోంది.

వివరాలు 

ఫ్యాక్టరీల ఉద్యోగాలపైనా ప్రభావం

ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించి జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన పెట్టుబడిదారులను సంప్రదించినట్లు సమాచారం. అమెజాన్ గిడ్డంగుల్లో ఇప్పటికే భారీగా రోబోటిక్ వ్యవస్థలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కోడింగ్, ఈమెయిల్స్ రచన, పరిశోధన రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం చూపిన ఏఐ.. ఇక వేర్‌హౌస్‌లు, ఫ్యాక్టరీల ఉద్యోగాలపైనా ప్రభావం చూపే దిశగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement