Korea Post Cyberattack: కొరియా పోస్ట్‌పై సైబర్ దాడి.. 1.13 లక్షల మంది వివరాలు లీక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్‌లైన్‌లో పోస్టల్ సేవలు వినియోగించుకునే వారి వ్యక్తిగత సమాచారం ఎంత భద్రంగా ఉందనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణ కొరియా ప్రభుత్వ పోస్టల్ సంస్థ 'కొరియా పోస్ట్'పై సైబర్ దాడి జరగడంతో ఏకంగా 1,13,855 మంది వివరాలు బయటపడ్డాయి. బాధితులకు సంబంధించిన పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సంస్థ దర్యాప్తు ప్రారంభించడంతో పాటు కొన్ని ఆన్‌లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Details
డెలివరీ అడ్రస్ మార్చే సదుపాయమే లక్ష్యంగా..
కొరియా పోస్ట్ మొబైల్ ఇంటర్నెట్ పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌లోని ఒక ఫీచర్‌ను హ్యాకర్లు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమ పోస్టల్ డెలివరీ చిరునామాను మార్చుకోవచ్చు.
నవంబర్ 17 నుంచి 24 మధ్య డెలివరీ కావాల్సిన రిజిస్టర్డ్ పోస్టు వివరాలపై దాడి జరిగినట్లు వెల్లడైంది.
కేవలం ఒక్కరోజుకు సంబంధించిన డేటాను పరిశీలించగా 1,13,855 మంది వ్యక్తిగత సమాచారం బయటపడినట్లు తేలింది.
మొత్తం ఎంతమంది ప్రభావితమయ్యారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Details
దర్యాప్తు ప్రారంభం.. కొన్ని సేవలు నిలిపివేత
బుధవారం సైబర్ దాడికి సంబంధించిన సంకేతాలను గుర్తించిన కొరియా పోస్ట్ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరింది. మరోవైపు వినియోగదారుల భద్రత దృష్ట్యా మొబైల్ వెబ్‌సైట్‌లో డెలివరీ చిరునామా మార్చుకునే సదుపాయంతో పాటు మరికొన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
దాడి ఎలా జరిగింది? హ్యాకర్లు ఎంతకాలంగా ఈ వ్యవస్థలోకి ప్రవేశించారు? మరెంతమంది వివరాలు వారి చేతికి చిక్కాయి? అనే అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.
Details
ప్రజలకు క్షమాపణ చెప్పిన సంస్థ అధిపతి
ఈ ఘటనపై కొరియా పోస్ట్ అధిపతి పార్క్ ఇన్-హ్వాన్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
ప్రజలు, పోస్టల్ సేవల వినియోగదారుల్లో ఆందోళన కలిగించినందుకు విచారం వ్యక్తం చేశారు.
డేటా లీక్‌కు అసలు కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Details
ఆన్‌లైన్ సేవల భద్రతపై మళ్లీ ఆందోళన
ప్రభుత్వ సేవలు వేగంగా ఆన్‌లైన్‌లోకి మారుతున్న సమయంలో ఈ డేటా లీక్ కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ప్రజల వ్యక్తిగత వివరాలను భద్రపరిచే వ్యవస్థల్లో చిన్నపాటి లోపం ఉన్నా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఇప్పటికే దక్షిణ కొరియాలో ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు సంబంధించిన డేటా చోరీ ఘటనలు వెలుగులోకి వస్తుండగా.. తాజాగా కొరియా పోస్ట్‌పై దాడి ఆందోళన పెంచింది. దర్యాప్తు పూర్తయితేనే ఈ ఘటన తీవ్రతపై పూర్తి స్పష్టత రానుంది.