LOADING...
Ladakh: గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మంచు నిల్వలతో సాగు చేస్తున్న లడఖ్ రైతులు
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మంచు నిల్వలతో సాగు చేస్తున్న లడఖ్ రైతులు

Ladakh: గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. మంచు నిల్వలతో సాగు చేస్తున్న లడఖ్ రైతులు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 19, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

లడఖ్‌లోని మారుమూల హిమాలయ గ్రామాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో చిన్న పర్వత హిమానీనదాలు కరిగిపోవడంతో రైతులు ఇప్పుడు కృత్రిమ హిమానీనదాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీబీసీ తన కథనంలో వెల్లడించింది. దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో ఉన్న సక్తి గ్రామానికి చెందిన 65 ఏళ్ల రైతు గెలాక్ గుట్మే గురించి ఈ కథనం ప్రస్తావించింది. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం గోధుమలు, బఠానీలు, బంగాళాదుంపలు పండిస్తూ గడిపారు. లడఖ్‌లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట సాగు చేసే అవకాశం ఉంటుందని, ఇక్కడి వాతావరణం అత్యంత కఠినమైన ఎడారి వాతావరణంగా ఉంటుందని గుట్మే తెలిపినట్లు నివేదిక పేర్కొంది.

వివరాలు

దయనీయ స్థితిలో రైతులు..

గుట్మే జీవితకాలంలో ఈ ప్రాంత పరిస్థితులు గణనీయంగా మారిపోయాయని కథనం వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఒకప్పుడు రైతులకు ప్రధాన నీటి వనరుగా ఉన్న తక్కువ ఎత్తులోని చిన్న హిమానీనదాలు క్రమంగా కరిగిపోయాయి. లడఖ్‌లోని స్థానిక నీటి నిర్వహణ కమిటీ సభ్యుడు లోబ్‌జాంగ్ ఫార్డోడ్ మాట్లాడుతూ, లోయలపై ఉన్న చిన్న హిమానీనదాలు గతంలో సహజ జలాశయాల్లా పనిచేసేవని వివరించారు. అవి శీతాకాలంలో నీటిని నిల్వ చేసి, వసంతకాలంలో వ్యవసాయం ప్రారంభమయ్యే సమయంలో కరిగి నీటిని అందించేవని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ హిమానీనదాలు పూర్తిగా కరిగిపోయి రాళ్లు మాత్రమే మిగిలాయని, ఎత్తైన ప్రాంతాల్లో కూడా కరిగి నీరు అందించే మంచు ఇక లేదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

ఎత్తైన ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటి సేకరణ..

పర్వత ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తక్కువగా ఉండటంతో రైతులు మే నెలలోనే పంటలు వేయాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. అలా చేస్తేనే శీతాకాలం తిరిగి ప్రారంభమయ్యేలోపు పంటను కోయడం సాధ్యమవుతుంది. అందుకే వసంతకాలం ప్రారంభంలోనే నమ్మకమైన నీటి వనరు ఉండటం అక్కడి వ్యవసాయానికి అత్యంత కీలకమని పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారంగా 2010ల ప్రారంభంలో లడఖ్‌లోని కొన్ని గ్రామాలు తమ సొంత మంచు నిల్వలను నిర్మించడం ప్రారంభించాయి. ఇందుకోసం శీతాకాలంలో ఎత్తైన ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటిని తీసుకొచ్చి గాల్లోకి చిమ్మి గడ్డకట్టేలా చేసేవారు. ఇలా క్రమంగా ఏర్పడిన భారీ మంచు గోపురాలను 'ఐస్ స్టూపాలు'గా పిలుస్తారు.

Advertisement

వివరాలు

మంచు అడ్డంకుల వల్ల తీవ్ర ఇబ్బందులు..

ఈ ఐస్ స్టూపాల వల్ల వసంతకాలంలో కరిగిన నీరు లభించినప్పటికీ, తీవ్రమైన చలికాలంలో వాటిని నిర్వహించడం చాలా కష్టమని ఫార్డోడ్ చెప్పారు. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ కంటే, కొన్ని సందర్భాల్లో మైనస్ 30 డిగ్రీల వరకు పడిపోతే పైపులలోని నీరు గడ్డకట్టి అవి పగిలిపోయేవని, దీంతో మొత్తం వ్యవస్థ దెబ్బతినేదని నివేదిక పేర్కొంది. దీనిని నివారించేందుకు నలుగురు లేదా ఐదుగురు రైతులతో కూడిన బృందాలు శీతాకాలం మొత్తం నీటి వనరు వద్దే రాత్రులు గడిపేవారు. అర్థరాత్రి సమయంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గితే వెంటనే మరిగించిన నీటితో పైపుల్లో ఏర్పడిన మంచు అడ్డంకులను తొలగించాల్సి వచ్చేదని కథనం తెలిపింది.

Advertisement

వివరాలు

ఆటోమేటెడ్ ఐస్ రిజర్వాయర్ అభివృద్ధి..

లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లోని ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముర్తజా అలీ మాట్లాడుతూ, సంప్రదాయ నీటి వ్యవస్థలు విఫలమవడంతో లేహ్-లడఖ్ ఇప్పుడు స్థానిక స్థాయిలో జలవనరుల సాంకేతిక పరిష్కారాల కేంద్రంగా మారిందని తెలిపారు. అలాగే ఐస్ స్టూపా విధానంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని అలీ పేర్కొన్నారు. నీరు నిరంతరం ప్రవహించడం వల్ల వెచ్చని రోజులలో ఇప్పటికే ఏర్పడిన మంచు తాజా నీటి కారణంగా తిరిగి కరిగిపోయేదని ఆయన వివరించారు. గత కొన్నేళ్లలో ఈ విధానాన్ని ఆధునిక సాంకేతికతతో మరింత మెరుగుపరిచారని నివేదిక తెలిపింది. ఏకర్స్ ఆఫ్ఐస్ అనే ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో 'ఆటోమేటెడ్ ఐస్ రిజర్వాయర్ (AIR)' పేరుతో కొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు.

వివరాలు

ఏకర్స్ ఆఫ్ ఐస్ సంస్థ ఏం చెప్పిందంటే..

ఏకర్స్ ఆఫ్ ఐస్ వ్యవస్థాపకుడు డాక్టర్ సూర్యనారాయణన్ బాలసుబ్రహ్మణియన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ AIR విధానంలో కూడా ఎత్తైన ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటిని తీసుకొస్తారు. ఒత్తిడితో లోయ ప్రాంతానికి చేరుకున్న నీటిని భారీ ఫౌంటెన్‌ను తలపించే నిలువు నాజిల్ ద్వారా బయటకు విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వాతావరణ ప్రభావానికి తట్టుకునే ప్రత్యేక కంట్రోల్ బాక్స్‌లో అమర్చిన కంప్యూటర్ వ్యవస్థ నియంత్రిస్తుంది. దీనికి సౌర విద్యుత్ ప్యానెల్లు, బ్యాటరీల ద్వారా విద్యుత్ సరఫరా అందుతుంది. అలాగే ఈ వ్యవస్థ ఎప్పటికప్పుడు వాతావరణ కేంద్రంతో అనుసంధానమై ఉండి, పైపులలోని నీటి ఉష్ణోగ్రతతో పాటు ఇతర పర్యావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తుందని నివేదిక వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement