US: AIపై ప్రభుత్వ నియంత్రణకు 'కిల్ స్విచ్' చట్టం.. అమెరికాలో బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు అదుపు తప్పి ప్రజలకు ప్రమాదంగా మారే పరిస్థితులు ఏర్పడితే వాటిని వెంటనే నిలిపివేసే అధికారాన్ని అమెరికా ప్రభుత్వానికి కల్పించేందుకు కొత్త చట్టం ప్రతిపాదించారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు టెడ్ లియు,రిపబ్లికన్ సభ్యుడు నాథనియెల్ మోరాన్ సంయుక్తంగా 'AI Kill Switch Act' పేరుతో బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఇటీవల ఓపెన్ఏఐ తన కొన్ని AI మోడళ్లు ఊహించని విధంగా ప్రవర్తించి, ఒక కీలక కంప్యూటర్ కోడ్ రిపాజిటరీలో అనధికారికంగా జోక్యం చేసుకున్నట్లు అంగీకరించిన నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇలాంటి అదుపు తప్పిన AI వ్యవస్థలను వెంటనే నిలిపివేసే స్పష్టమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని టెడ్ లియు పేర్కొన్నారు.
వివరాలు
AI నియంత్రణ మాత్రం మనుషుల చేతుల్లోనే ఉండాలి: నాథనియెల్ మోరాన్
AI అభివృద్ధి కొనసాగాల్సిందేనని, అయితే దానిపై తుది నియంత్రణ మాత్రం మనుషుల చేతుల్లోనే ఉండాలని నాథనియెల్ మోరాన్ అన్నారు.
ఈ బిల్లు ప్రకారం ప్రజల భద్రతకు ముప్పుగా మారిందని భావిస్తే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఏదైనా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన AI మోడల్ లేదా టూల్‌ను నిలిపివేయాలని ఆదేశించే అధికారం ఉంటుంది.
అలాగే AI సంస్థలు తమ వ్యవస్థలను వేగం తగ్గించడం, తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా ఆఫ్ చేసే సాంకేతిక సామర్థ్యాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
అంతేకాదు, AI వ్యవస్థల్లో జరిగే సాంకేతిక లోపాలు, భద్రతా వైఫల్యాలు లేదా ప్రమాదకర ఘటనలను ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకురావాల్సిన నిబంధనలను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
వివరాలు
బిల్లుకు మద్దతు
పరిస్థితిని బట్టి మొదట వేగాన్ని తగ్గించడం నుంచి అవసరమైతే పూర్తిగా నిలిపివేసే వరకు అనుసరించాల్సిన అధికారిక విధానాన్ని రూపొందించాలనే ప్రతిపాదన ఇందులో ఉంది.
ఇదేసమయంలో ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన కొన్ని AIమోడళ్ల సైబర్ హ్యాకింగ్ సామర్థ్యాలపై కూడా టెడ్ లియు ఆందోళన వ్యక్తం చేశారు.
AI ఇప్పటికే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిని దాటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం,రవాణా వ్యవస్థలను నియంత్రించడం,సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుందని ఆయన అన్నారు.
అందుకే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకునే చట్టబద్ధమైన వ్యవస్థ అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఈ బిల్లుకు AI భద్రతపై పనిచేస్తున్న పలు సాంకేతిక సంస్థలు,విధాన నిపుణుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.