Social Media Ban: మలేషియాలో 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో, సోషల్ మీడియాలో చిన్నవాళ్లు-పెద్దవాళ్లు అనే తేడా లేకుండా గంటల కొద్దీ టైమ్ గడిపేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ఇటీవల ఆ దేశ పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ చట్టం వచ్చే నెల 10 నుంచి అమల్లోకి వస్తోంది. అయితే ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుసరిస్తూ మరో దేశం కూడా అదే దారిలో నడవాలని చూస్తోంది.
వివరాలు
వచ్చే ఏడాదిలోపు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించాలనే ఆలోచన
మలేషియా ప్రభుత్వం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకం నిషేధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మలేషియా (Malaysia) సైతం అండర్ 16 పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని (Social Media Ban) అమలు చేసే ప్లాన్ చేస్తున్నదని, సామాజిక మాధ్యమాలపై పరిమితులు విధించడంలో ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు ఎలా వ్యవహరిస్తున్నాయో తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపినట్లు స్థానిక మీడియా కథనం వెలువరించింది. వచ్చే ఏడాదిలోపు 16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం, తల్లిదండ్రులు రెండూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కూడా అభిప్రాయపడ్డారు.
వివరాలు
వచ్చే డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్లలోపు ఖాతాదారులను తొలగించాల్సిందే: ఆస్ట్రేలియా
ఇదిలా ఉంటే, పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో మలేషియా ఇటీవల సోషల్ మీడియా సేవలపై తన పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. ఇక సెప్టెంబర్‌లో వెలువడిన ఇప్సోస్ మలేషియా ఎడ్యుకేషన్ మానిటర్ 2025 సర్వేలో అక్కడి 72 శాతం మంది పాల్గొన్నవారు పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని అంగీకరించారు. ఆస్ట్రేలియాలో అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారంలు వచ్చే డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్లలోపు ఖాతాదారులను తొలగించాల్సిందే. లేకుంటే భారీ మొత్తంలో జరిమానాలు విధించేలా చట్టం రూపొందించారు.
వివరాలు
ఈ యాప్‌లను వాడకుండా చూడాలని సూచించిన నెదర్లాండ్స్
అదేవిధంగా, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగాన్ని కట్టడి చేసే బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది నెదర్లాండ్స్ (డచ్ ప్రభుత్వం) తల్లిదండ్రులకు 15 ఏళ్ల లోపు పిల్లలు టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను వాడకుండా చూడాలని సూచించింది. ఇక యూరోపియన్ యూనియన్‌కు చెందిన డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాలు పిల్లలు ఆన్‌లైన్‌లో హానికర కంటెంట్‌కు చేరకుండా నిరోధించేందుకు, సోషల్ మీడియా వినియోగదారుల వయస్సును ధృవీకరించే ప్రత్యేక యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి.