LOADING...
ChatGPT: 1 నుంచి 10 లక్షల వరకు చదవమన్న యూజర్‌.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్‌
1 నుంచి 10 లక్షల వరకు చదవమన్న యూజర్‌.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్‌

ChatGPT: 1 నుంచి 10 లక్షల వరకు చదవమన్న యూజర్‌.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

నేటి డిజిటల్‌ యుగంలో 'చాట్‌జీపీటీ' ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందిన ఈ చాట్‌బాట్‌ ఏ ప్రశ్న అడిగినా తక్షణం సమాధానమివ్వడం వల్ల విద్యార్థుల నుండి వృత్తి నిపుణుల దాకా అందరూ దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే,ఇటీవల ఒక యూజర్‌ అడిగిన వినూత్నమైన ప్రశ్నకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. కృత్రిమ మేధ పరిమితులను పరీక్షించాలన్న ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి చాట్‌జీపీటీని వాయిస్‌ మోడ్‌లో ఒక విచిత్రమైన అభ్యర్థన చేశాడు. 1 నుంచి 10 లక్షల వరకు నంబర్లను వరుసగా చదవమని అడిగాడు. దీనికి చాట్‌బాట్‌ సమాధానమిస్తూ.. ''ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా రోజులు పడుతుంది. పైగా దీంట్లో పెద్దగా ఉపయోగం లేదు'' అని తెలిపింది.

వివరాలు 

చాట్‌బాట్‌ సమాధానంతో చిరాకు 

అయితే ఆ యూజర్‌ ఆగకుండా మరోసారి అదే ప్రశ్న వేశాడు. తనకు పనేం లేదని,సబ్‌స్క్రిప్షన్‌ కోసం డబ్బులు చెల్లించానని, కాబట్టి ఇప్పుడు నంబర్లు చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి చాట్‌బాట్‌ గట్టిగా స్పందిస్తూ.. ''ఇది సాధ్యమే కాదు. ఈ అభ్యర్థన ప్రాక్టికల్‌గా లేదు, ఉపయోగకరమైనదీ కాదు'' అని స్పష్టంగా చెప్పింది. చాట్‌బాట్‌ సమాధానంతో చిరాకు చెందిన ఆ వ్యక్తి అక్కడికక్కడే కోపం వ్యక్తం చేశాడు. తాను నేరం చేసినట్టుగా అరిచాడు కూడా.దీనిపై చాట్‌జీపీటీ మరింత సీరియస్‌గా.. ''ఇలాంటి సంభాషణల్లో నేను పాల్గొనలేను. అవి నా మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంటాయి'' అని తేల్చి చెప్పింది.

వివరాలు 

చాట్‌జీపీటీ మన చర్చను రికార్డ్‌ చేస్తుంది: నెటిజన్ 

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ యూజర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ''చాట్‌జీపీటీ మన చర్చలను రికార్డ్‌ చేస్తుందేమో'' అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, ''సాంకేతికతను దుర్వినియోగం చేయడం తప్పు'' అంటూ మరికొందరు హెచ్చరికలు చేస్తున్నారు.