Dust Devils: అంగారక గ్రహంపై భారీ ధూళి సుడిగాలులు.. మార్స్ ఆర్బిటర్ కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక గ్రహంపై ఉన్న మామర్స్ వల్లెస్ (Mamers Valles) ప్రాంతానికి సంబంధించిన ఆసక్తికర చిత్రాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) విడుదల చేసింది. 2003 నుంచి అంగారక గ్రహాన్ని పరిశీలిస్తున్న మార్స్ ఎక్స్‌ప్రెస్ (Mars Express) వ్యోమనౌక ఈ చిత్రాలను బంధించింది. ఫొటోల్లో అంగారక గ్రహంలోని విస్తారమైన లోయల వ్యవస్థలో డజన్ల కొద్దీ ధూళి సుడిగాలులు తిరుగుతూ కనిపించాయి. వీటి ద్వారా అక్కడి గాలుల వేగం శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది. సూర్యకాంతి వల్ల అంగారక గ్రహం ఉపరితలం వేడెక్కినప్పుడు, నేలకు సమీపంలోని గాలి పైకి సుడులు తిరుగుతూ లేచి, ధూళిని తన వెంట తీసుకెళ్తుందని ESA తెలిపింది.
వివరాలు
45 మీటర్ల వరకు ధూళి..
ఈ ధూళి సుడిగాలులు భూమిపై పొడి, ధూళితో నిండిన ప్రాంతాల్లో కనిపించే సుడిగాలుల మాదిరిగానే ఉంటాయని ESA పేర్కొంది. అయితే ఇవి వాటికంటే ఎంతో భారీగా ఉంటాయని వివరించింది. ఇవి గరిష్ఠంగా 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎదగడమే కాకుండా, అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని తెలిపింది. అలాగే వీటి గరిష్ఠ వేగం సెకనుకు 45 మీటర్ల వరకు చేరుకుంటుందని వెల్లడించింది. ఈ చిత్రాలను మార్స్ ఎక్స్‌ప్రెస్లో అమర్చిన ఎనిమిది శాస్త్రీయ పరికరాల్లో ఒకటైన హై రిజల్యూషన్ స్టీరియో కెమెరా (HRSC) చిత్రీకరించింది. ఇందులో సుమారు 30 క్రియాశీల ధూళి సుడిగాలులు కనిపించాయి. ఇవి చిన్న పసుపు రంగు చుక్కల్లా కనిపిస్తూ, వాటి వెనుక గులాబీ రంగు నీడల మాదిరిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
వివరాలు
శాస్త్రవేత్తలు ఏం గుర్తించారంటే..
గతంలో శాస్త్రవేత్తలు ఈ ధూళి సుడిగాలుల గరిష్ఠ వేగం గంటకు 158 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ వేగం అంగారక గ్రహంపై సంచరించిన రోవర్లు నమోదు చేసిన గాలుల వేగం కంటే ఎక్కువగా ఉంది. మామర్స్ వల్లెస్ అనేది అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలో ఉన్న పొడవైన, వంకరలతో కూడిన లోయలో ఏర్పడిన కాలువల సముదాయం. దాదాపు 1,000 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ ప్రాంతం సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహ చరిత్రలోని లేట్ నోయాకియన్ (Late Noachian) కాలానికి చెందినదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.