LOADING...
Meta: ఉద్యోగుల ప్రైవసీపై విమర్శలు.. ట్రాకింగ్ విధానంలో మెటా మార్పులు
ఉద్యోగుల ప్రైవసీపై విమర్శలు.. ట్రాకింగ్ విధానంలో మెటా మార్పులు

Meta: ఉద్యోగుల ప్రైవసీపై విమర్శలు.. ట్రాకింగ్ విధానంలో మెటా మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) అభివృద్ధి కోసం ఉద్యోగుల కంప్యూటర్ వినియోగాన్ని పర్యవేక్షించే వివాదాస్పద కార్యక్రమంలో మెటా కొంత వెనక్కి తగ్గింది. మెటా అయితే ఈ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయకుండా, కొన్ని పరిమిత మార్పులతో కొనసాగించాలని నిర్ణయించింది. సంస్థలో "మోడల్ కెపాబిలిటీ ఇనిషియేటివ్ (MCI)" పేరుతో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు కంప్యూటర్లను ఎలా ఉపయోగిస్తున్నారో నమోదు చేస్తారు. మౌస్ కదలికలు, క్లిక్‌లు, కీబోర్డ్ టైపింగ్ వంటి వివరాలను సేకరించి, వాటిని AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వినియోగిస్తున్నారు.

వివరాలు 

30 నిమిషాల పాటు మానిటరింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేత 

ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మెటా తాజాగా కొన్ని సడలింపులను ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు వ్యక్తిగత అవసరాల కోసం తమ కార్యాలయ పరికరాలను ఉపయోగించే సమయంలో గరిష్టంగా 30 నిమిషాల పాటు మానిటరింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అలాగే ఇంటర్నెట్ పరిమితులు ఉన్న రిమోట్ ఉద్యోగులు, సున్నితమైన సమాచారంతో పనిచేసే సిబ్బంది, పరికరాలను ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచడం కష్టమయ్యే పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు కోరే అవకాశం కల్పించింది. గత నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే మెటా సుమారు 8,000 ఉద్యోగాలను తొలగించడం,వేలాది మంది సిబ్బందిని AI సంబంధిత విభాగాలకు బదిలీ చేయడం వంటి కీలక నిర్ణయాలను ప్రకటించింది.

వివరాలు 

ఉద్యోగులు మాత్రం డేటా సేకరణ ప్రక్రియలో పాల్గోవాలిసిందే..

అయితే ఈ మార్పులు కొద్దిమందికే వర్తిస్తాయని, ఎక్కువ మంది ఉద్యోగులు మాత్రం డేటా సేకరణ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని తెలుస్తోంది. మరోవైపు మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ వల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోందన్న ఫిర్యాదులపై స్పందించిన మెటా, సాఫ్ట్‌వేర్ పనితీరును మెరుగుపరిచినట్లు ఉద్యోగులకు తెలిపింది. ప్రముఖ టెక్ కంపెనీల మధ్య AI పోటీ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో, అనుభవజ్ఞులైన ఉద్యోగులు డిజిటల్ పనులను ఎలా నిర్వహిస్తున్నారో గమనించడం ద్వారా భవిష్యత్ AI వ్యవస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దవచ్చని మెటా భావిస్తోంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సంస్థలో వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి.

Advertisement

వివరాలు 

మరింత బలపడిన ఆందోళనలు

దీంతో ఉద్యోగులపై నిఘా పెరుగుతోందనే ఆందోళనలు మరింత బలపడ్డాయి. ఈ అంశంపై స్పందించిన మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, AI సామర్థ్యాలను వేగంగా పెంచడానికి ప్రతిభావంతులైన ఉద్యోగుల పని విధానాన్ని అధ్యయనం చేయడం అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు. ఈ డేటాను ఉద్యోగుల పనితీరు అంచనా వేయడానికి లేదా నిఘా కోసం ఉపయోగించడం లేదని, కేవలం AI అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఉద్యోగుల గోప్యత, కార్యాలయ నిఘా, AI శిక్షణ కోసం సేకరించే డేటా పరిమితులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో ఈ తరహా కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశమున్నట్లు జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement