Loading...
Meta: చిన్నారుల లైంగిక వేధింపుల కేసులు.. భారత అధికారులకు సమాచారం ఇవ్వనున్న మెటా
చిన్నారుల లైంగిక వేధింపుల కేసులు.. భారత అధికారులకు సమాచారం ఇవ్వనున్న మెటా

Meta: చిన్నారుల లైంగిక వేధింపుల కేసులు.. భారత అధికారులకు సమాచారం ఇవ్వనున్న మెటా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా వేదికలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల వివరాలను నేరుగా భారతీయ పోలీసులకు అందించేందుకు ఆ సంస్థ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చిన్నారుల ఆన్‌లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే.. పిల్లల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఈ విషయంలో భద్రతా ప్రమాణాలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

వివరాలు 

తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం,NCPCR

ఇటీవల మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు కనిపిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

దీనిపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) తీవ్రంగా స్పందించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో పిల్లల రక్షణ అనేది ప్రతి సోషల్ మీడియా సంస్థకు ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

వివరాలు 

మెటా తీసుకున్న నిర్ణయం కీలకమైన తొలి అడుగు

హానికరమైన సమాచారాన్ని ముందుగానే గుర్తించడం, అలాంటి కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తొలగించడం వంటి చర్యలు తీసుకోని సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం హెచ్చరించింది.

పిల్లలకు సోషల్ మీడియా వేదికలను మరింత సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న నిర్ణయం కీలకమైన తొలి అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడా చిన్నారుల రక్షణకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

ADVERTISEMENT