Microsoft Services Down: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌పై క్షమాపణలు.. అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా తమ సేవలకు అంతరాయం ఏర్పడటంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, భాగస్వాములకు క్షమాపణలు తెలిపింది. ఈ భారీ గ్లోబల్ అవుటేజ్ కారణంగా Outlook, Microsoft Teams, Copilot సహా పలు కీలక సేవలు ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం తమ సేవల్లో విస్తృత స్థాయిలో పునరుద్ధరణ జరుగుతోందని, స్థిరత్వం కూడా కనిపిస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ అంతరాయానికి సైబర్ దాడి లేదా కృత్రిమ మేధ (AI), ఏఐ ఏజెంట్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లో సాంకేతిక సమస్యే కారణం
ఈ భారీ అంతరాయానికి అసలు కారణమేంటో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో విడుదల చేసిన ప్రకటనలో.. గతంలో చేపట్టిన నెట్‌వర్క్ సామర్థ్య పెంపు (Network Capacity Upgrade) ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్యే తాజా అవుటేజ్‌కు కారణమని తెలిపింది.
ఇటీవల చేపట్టిన నెట్‌వర్క్ మార్పుల తర్వాత, అంతకుముందు సామర్థ్య పెంపు ప్రక్రియలో ఏర్పడిన సమస్య బయటపడిందని వివరించింది.
ఈ ఘటన కారణంగా వినియోగదారులు, భాగస్వాములు ఎదుర్కొన్న అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తమ సేవలపై వినియోగదారులు ఉంచిన నమ్మకాన్ని అత్యంత బాధ్యతగా తీసుకుంటామని పేర్కొంది.
వివరాలు
సైబర్ దాడి కాదు.. ఏఐ వల్ల కూడా కాదు
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన భారీ అంతరాయంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కీలక స్పష్టత ఇచ్చింది.
ఈ ఘటనకు సైబర్ దాడితో ఎలాంటి సంబంధం లేదని, అలాగే కృత్రిమ మేధ లేదా ఏఐ ఏజెంట్ల వల్ల కూడా సమస్య తలెత్తలేదని స్పష్టం చేసింది.
సమస్యకు మూలకారణాన్ని గుర్తించి పరిష్కరించినట్లు తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా సేవల పునరుద్ధరణ కొనసాగుతోందని వెల్లడించింది.
వివరాలు
దశలవారీగా సేవల పునరుద్ధరణ
భారీ స్థాయిలో సేవలను వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వాటిని ఒకేసారి పూర్తిగా ప్రారంభించలేదు. దశలవారీగా పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టింది.
ప్రతి దశలో సేవల స్థిరత్వాన్ని పరీక్షించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ప్రక్రియకు కొంత ఎక్కువ సమయం పట్టినప్పటికీ, సేవలను స్థిరంగా పునరుద్ధరించేందుకు ఇది అవసరమని కంపెనీ పేర్కొంది.
ఈ ఘటనపై పూర్తి సమీక్ష పూర్తయిన తర్వాత సమగ్ర పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ విడుదల చేస్తామని వెల్లడించింది.
వివరాలు
74 దేశాల్లో ప్రభావం.. లక్షలాది మందికి ఇబ్బందులు
ఈ గ్లోబల్ అవుటేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు దాదాపు 24 గంటల పాటు మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించలేకపోయారు.
అమెరికాతో సహా కనీసం 74 దేశాల్లోని వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ విభాగాలు, విమానయాన కార్యకలాపాలపై ప్రభావం పడింది.
ప్రధానంగా Outlook, Microsoft Teams, Copilot సేవలు నిలిచిపోయాయి. విమానయాన కార్యకలాపాలపైనా ఈ అంతరాయం ప్రభావం చూపింది.
దీంతో పలు ప్రధాన భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి.
అదేవిధంగా OpenAI, Anthropic వంటి సంస్థలు ఉపయోగించే కొన్ని ఏఐ సర్వీస్ కనెక్టర్లు కూడా ప్రభావితమైనట్లు సమాచారం.
వివరాలు
డౌన్‌డిటెక్టర్‌లో భారీగా ఫిర్యాదులు
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయం తీవ్రతను డౌన్‌డిటెక్టర్ (Downdetector) గణాంకాలు స్పష్టం చేశాయి.
మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో Outlook సేవలకు సంబంధించిన సమస్యలపై ఏకంగా 1,38,058 ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఆ తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో సాయంత్రానికి ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. Microsoft 365 సేవలకు సంబంధించిన సమస్యల నివేదికలు కూడా క్రమంగా తగ్గాయి.
Microsoft Teams వినియోగదారుల్లోనూ కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరాలు
త్వరలో సమగ్ర నివేదిక విడుదల
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సేవలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
ఈ భారీ గ్లోబల్ అవుటేజ్‌కు సంబంధించిన పూర్తి కారణాలు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.