LOADING...
Vikram-I: రేపు ఆర్బిటల్ రాకెట్‌ను ఆవిష్కరించనున్న మోదీ 
రేపు ఆర్బిటల్ రాకెట్‌ను ఆవిష్కరించనున్న మోదీ

Vikram-I: రేపు ఆర్బిటల్ రాకెట్‌ను ఆవిష్కరించనున్న మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశంలోని తొలి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో, హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ కొత్తగా ఏర్పాటు చేసిన'ఇన్ఫినిటీ క్యాంపస్'ను కూడా ప్రారంభించనున్నారు. లాంచ్ వాహనాలను డిజైన్ చేయడం,అభివృద్ధి చేయడం,అసెంబుల్ చెయ్యడం,టెస్టింగ్ వంటి కార్యకలాపాలకు ప్రత్యేకంగా నిర్మించిన ఈ ఆధునిక సముదాయం స్కైరూట్‌కు పెద్ద కేంద్రంగా నిలవనుంది. మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన ఇన్ఫినిటీ క్యాంపస్‌ ప్రతి నెలా ఒక ఆర్బిటల్ రాకెట్‌ను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగివుంది. దీంతో భారత ప్రైవేట్‌ స్పేస్‌ రంగాన్ని బలపరచాలనే లక్ష్యంతో స్కైరూట్ విక్రమ్-1 ఉత్పత్తిని వేగవంతం చేయనుందని సంస్థ చెబుతోంది.

వివరాలు 

ఉపగ్రహాలను భూమి చుట్టూ కక్ష్యలో ఉంచగలిగే రాకెట్

ఉపగ్రహాలను భూమి చుట్టూ కక్ష్యలో ఉంచగలిగే ఈ రాకెట్‌ దేశ స్పేస్‌ సామర్థ్యాల్లో మరో ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. ఐఐటి మాజీ విద్యార్థులు,ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ చందనా,భారత్ధాకా కలిసి స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్,భారత ప్రైవేట్‌ స్పేస్ రంగంలో ముందంజలో ఉన్న సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ 2022 నవంబరులో భారత్‌ తొలి ప్రైవేటు రాకెట్ అయిన ఉప-ఆర్బిటల్ విక్రమ్-Sను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. తాజాగా విక్రమ్-1 ఆవిష్కరణ,ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం..ఈ రెండూ కలిసి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం వేగంగా పెరుగుతున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వసంస్థలు,ప్రైవేట్ కంపెనీల మధ్య సహకారం మరింత బలపడుతున్న ఈ దశ భారతదేశాన్ని గ్లోబల్ స్పేస్ రంగంలో మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టనున్నదని నిపుణులు చెబుతున్నారు.