
Iceland: ఐస్లాండ్‌లో తొలిసారిగాకనిపించిన 'కులిసెటా అనులాటా' జాతి దోమలు.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో దోమలు లేని స్వర్గధామం ఏదైనా ఉందా అంటే నిన్నమొన్నటి వరకు ఐస్‌లాండ్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రత్యేకతకి తెరపడింది. చరిత్రలో తొలిసారి ఐస్‌లాండ్‌లో దోమలు కనిపించటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా ఈ మార్పు ఏర్పడినట్టు,దోమల నివాసానికి అనువైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌లాండ్ రాజధాని రెక్‌జావిక్‌కి సమీపంలో ఉన్న క్జోస్ ప్రాంతంలో ఈ దోమలను గుర్తించారు. కీటకాలపై పరిశోధన చేసే స్థానిక శాస్త్రవేత్త బ్జోర్న్ హాల్టాసన్‌కు గత వారం ఇవి కనిపించాయి. రాత్రిపూట చిమ్మటలను ఆకర్షించడానికి వైన్‌లో ముంచిన తాళ్లను ఉపయోగించినప్పుడు,వాటిపై కొన్ని వింత కీటకాలు వాలాయి. వాటిని చూసిన వెంటనే, తానూ ఇప్పటివరకు చూడని కొత్త జీవులను గుర్తించానని తెలిపారు.
వివరాలు
ఈ దోమలు శీతాకాలాన్ని కూడా తట్టుకుని జీవించగలవు
తక్షణమే ఆ కీటకాలను సేకరించి,ఐస్‌లాండిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి పంపారు. అక్కడి శాస్త్రవేత్త మాథియాస్ ఆల్ఫ్రెడ్‌సన్ పరిశీలించి,అవి 'కులిసెటా అనులాటా' జాతికి చెందిన దోమలు అని నిర్ధారించారు. ఇవి శీతాకాలాన్ని కూడా తట్టుకుని జీవించగలవని ఆయన పేర్కొన్నారు.హాల్టాసన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ,"దోమలు లేని మన చివరి కోట కూడా కూలిపోయినట్టుంది" అని వ్యాఖ్యానించారు. సాధారణంగా ఐస్‌లాండ్‌లోని చలికాల వాతావరణం,దోమలు పెరగడానికి అవసరమైన నిల్వ నీరు లేకపోవడం వలన అక్కడ దోమలు ఉండవు. కానీ ఈ ఏడాది వసంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి.మే నెలలో 10రోజుల పాటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌కి పైగా దాటింది. ఎగ్లిస్‌స్టాడిర్ విమానాశ్రయం వద్ద 26.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను నమోదు చేశారు.
వివరాలు
ప్రపంచంలో ఇకపై అంటార్కిటికాలో మాత్రమే దోమలు లేవని వెల్లడి
ఈవాతావరణ పరిస్థితులు దోమలకు నివాసం ఏర్పరచడానికి అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఈ దోమలు ఐస్‌లాండ్‌లోకి ఎలా వచ్చాయనే విషయంలో స్పష్టత లేదు. హాల్టాసన్ అనుమానం ప్రకారం,ఓడలు లేదా కంటైనర్ల ద్వారా ఇవి వచ్చి ఉండవచ్చు. తన ఇంటి వద్దే మూడు దోమలు కనిపించాయని పేర్కొన్న హాల్టాసన్,దేశంలో వాటి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని సూచించారు. ఈజాతి ఐస్‌లాండ్‌లో పూర్తిగా స్థిరపడిందా లేదో వచ్చే వసంతకాలంలో మరిన్ని పరిశీలనల తరువాత మాత్రమే తెలిసే అవకాశం ఉందని ఆల్ఫ్రెడ్‌సన్ పేర్కొన్నారు. ఈపరిణామంతో,ప్రపంచంలో దోమలు లేని ఏకైక ప్రదేశంగా ఇప్పుడు అంటార్కిటికా మాత్రమే మిగిలింది. మానవ కార్యకలాపాల కారణంగా భూమి,సముద్రాలు,వాతావరణం వేడెక్కుతున్న సందర్భంలో, ఐస్‌లాండ్‌లో దోమల ఉద్భవం వాతావరణ మార్పుల తీవ్రతకు సాక్ష్యంగా నిలుస్తోంది.