మార్స్ పై ఆలు ఫ్రైస్.. అంగారకుడిపై కోరుకున్న వంటకాలు
అంగారక గ్రహంపై ఆహారాన్ని వేయించడం ఇకపై సాధ్యమే. అవును మీరు విన్నది నిజమే. రెడ్ ప్లానెట్ అయిన మార్స్ పై కావాల్సిన వంటకాలు చేసుకోవడం సాధ్యమేనంటోంది యూరప్ స్పేస్ ఏజెన్సీ(ESA). ఈ మేరకు యూరప్ స్పేస్ ఏజెన్సీతో పాటు యూనివర్సిటీ ఆఫ్ థెస్సలోనికి పరిశోధకులు ఈ సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. ఇష్టమైన ఆలూ ఫ్రైస్‌తో సహా ఇతర ఆహారాన్ని వేయించుకోవడం అంతరిక్షంలోని మార్స్ పై సాధ్యమవుతుందని పేర్కొన్నాయి. అందరికీ ఎంతో రుచిని అందించి మనస్సును హాయిగా ఉంచే ఈ పొటాటో ఫ్రైస్ ఇక మీదట అంగారకుడి వద్ద చేసుకోగలగటం పట్ల శాస్త్రవేత్తల్లో ఆనందం కొత్తపుంతలు తొక్కుతోంది.
మరిన్ని పరిశోధనలతో పూర్తి స్థాయి ఫలితాలు: స్పేస్ ఏజెన్సీ
అసలు మార్స్ పై వంటకాలు అంటేనే కష్టతరం. ఎందుకంటే ఆ గ్రహం వద్ద ఉండే వాతావరణ స్థితిగతులు, అక్కడి మైక్రో గ్రావిటీ కండిషన్లే అందుకు కారణమని స్పెస్ ఏజెన్సీ అంటోంది. పొటాటోను వేయించడం కోసం ఇప్పటికే చాలా చోట్ల ప్రయత్నాలు చేశామని, అయితే అన్నింటిలోకి ఇది సంక్లిష్టమైన భౌతిక, రసాయన శాస్త్రాన్ని కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.అంతేకాదు దీనివల్ల అంతరిక్షంలో ప్రతిదీ మరింత క్లిష్టంగా మారుతుందని వెల్లడించింది. అయితే మార్స్ పై ఫ్రైస్ చేసుకోవడం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగాలని స్పష్టం చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు గ్రీస్ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ థెస్సలోనికి చెందిన సైంటిస్టుల సంయుక్త కృషితోనే ఈ అద్భుత సాధ్యమైందన్నారు.