Mysterious radio signal: 2025లో రహస్య గామా-రే సంకేతం: శాస్త్రవేత్తలకు చిక్కని అంతరిక్ష మిస్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
2025 జూలై 2 నుండి నాసా నిర్వహిస్తున్న ఫెర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్ ఒక అత్యంత అసాధారణమైన గామా-రే బర్స్ట్(GRB)ను గుర్తించింది. గామా-రే బర్స్ట్‌లు సాధారణంగానే కనిపిస్తుంటాయి కానీ, ఇది మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ GRB ఏకంగా ఏడు గంటల పాటు ఆన్-ఆఫ్‌గా కొనసాగుతూ, ప్రతి కొన్ని సెకన్లకు ఒకసారి శక్తివంతమైన ఉద్గారాలను విడుదల చేసింది. ఈ సంఘటన ఏమిటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వెంటనే భూమిపై ఉన్న టెలిస్కోప్‌లతో పరిశీలనలు ప్రారంభించారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మిగతా గామా-రే బర్స్ట్‌లకు భిన్నంగా ఇలా ప్రవర్తించింది? అనే అంశాలపై లోతైన అధ్యయనం చేశారు.
వివరాలు
ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్లో పరిశోధన ఫలితాలు
చివరకు ఇది ఇప్పటివరకు నమోదు అయిన వాటిలోనే అతి పొడవైన గామా-రే బర్స్ట్ అని నిర్ధారించారు. GRB 250702B అని పేరు పెట్టిన ఈ సంఘటన, కాంతి వేగానికి 99 శాతం వేగంతో ప్రయాణిస్తూ, విశ్వ పదార్థాన్ని మన వైపుగా పంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు నవంబర్ 26న ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. ఈ దూరమైన అంతరిక్ష బిందువులో నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవడం అంత సులువు కాలేదు. అందుకే పరిశోధకులు భూమిపై ఉన్న అత్యాధునిక టెలిస్కోప్‌లను ఉపయోగించారు. చిలీలోని జెమిని, వెరీ లార్జ్ టెలిస్కోప్, హవాయిలోని కెక్ అబ్జర్వేటరీతో పాటు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వివిధ తరంగదైర్ఘ్యాల్లో ఈ GRBను గమనించారు.
వివరాలు
టెలిస్కోప్‌లకు కేవలం ఇన్‌ఫ్రారెడ్, అధిక శక్తి గల ఎక్స్-రే తరంగాలే అందుబాటులోకి ..
విశ్లేషణలో ఇది సుమారు 8 బిలియన్ లైట్-యేళ్ల దూరంలో ఉన్న ధూళితో నిండిన ఒక గెలాక్సీ నుంచి వచ్చినట్లు తేలింది. అక్కడి నుంచి వచ్చిన రేడియో సిగ్నల్, కనబడే కాంతిని పూర్తిగా అడ్డుకునే దట్టమైన ధూళి పొరను దాటి మన సౌర వ్యవస్థకు చేరుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ ధూళి మేఘం కారణంగా సాధారణ కాంతిలో ఈ సంకేతం కనిపించలేదు. టెలిస్కోప్‌లకు కేవలం ఇన్‌ఫ్రారెడ్, అధిక శక్తి గల ఎక్స్-రే తరంగాలే అందుబాటులోకి వచ్చాయి. ఈ గామా-రే బర్స్ట్‌కు అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పరిశోధకులు కొన్ని కారణాలను ఊహించినా, ఏది నిజమో తేల్చలేకపోతున్నారు.
వివరాలు
GRB 250702Bనే ప్రామాణిక ఉదాహరణ
"మనుషులు ఇప్పటివరకు గమనించిన వాటిలో ఇది అతి పొడవైన గామా-రే బర్స్ట్. ఇది మన దగ్గర ఉన్న ఏ మోడల్‌కీ సరిపోవడం లేదు," అని ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత జోనాథన్ కార్నీ తెలిపారు. శాస్త్రవేత్తలు మూడు సంభావ్య కారణాలను ముందుంచారు. ఒకటి: భారీ నక్షత్రం మరణించడం, రెండోది: ఒక నక్షత్రాన్ని బ్లాక్ హోల్ మింగేయడం, మూడోది:హీలియం నక్షత్రం,బ్లాక్ హోల్ కలవడం వల్ల సంభవించే భారీ పేలుడు. అయితే వీటిలో ఏది నిజమైన కారణమో ఇప్పటికీ నిర్ధారణ కాలేదని కార్నీ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే, వాటిని పోల్చేందుకు GRB 250702Bనే ప్రామాణిక ఉదాహరణగా తీసుకుంటామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.