Narayanan: ఇస్రో చైర్మన్‌గా నారాయణన్.. కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో, నారాయణన్ ఈ నెల 14న చైర్మన్ పదవిని స్వీకరించనున్నారు. ఆయన ఈ హోదాలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ప్రస్తుతం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) డైరెక్టర్‌గా సేవలందిస్తున్న వి. నారాయణన్, భారత అంతరిక్ష రంగంలో కీలకమైన క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించారు.
ఇతర దేశాలు ఈ సాంకేతికతను అందించడానికి నిరాకరించిన సమయంలో, స్వదేశీ పరిజ్ఞానంతో దానిని విజయవంతంగా అభివృద్ధి చేసి భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.
Details
1984లో ఇస్రోలో చేరిన వి.నారాయన్
చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా నారాయణన్ మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధనకు స్పష్టమైన దిశ ఉందని, ఇస్రోను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు శాస్త్రవేత్తల ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగిస్తానని చెప్పారు.
1984లో ఇస్రోలో చేరిన వి. నారాయణన్, రాకెట్ ప్రొపల్షన్, అంతరిక్ష నౌకల రంగంలో అనేక కీలక అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
2018లో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత, ద్రవ, సెమీ-క్రయోజెనిక్, క్రయోజెనిక్ ఇంధన వ్యవస్థల అభివృద్ధి ద్వారా భారత అంతరిక్ష ప్రయోగాల్లో గణనీయమైన పురోగతిని సాధించారు.
ఆయన గగన్‌యాన్ మిషన్ కోసం మానవ రహిత సర్టిఫికేషన్ బోర్డ్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
Details
ప్రపంచ స్థాయిలో చంద్రయాన్-3 గుర్తింపు
తమిళ మాధ్యమ పాఠశాలలో విద్యనభ్యసించిన నారాయణన్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తిచేశారు.
అక్కడ ప్రథమ ర్యాంకు సాధించి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ నేతృత్వంలో ఇస్రో, చంద్రయాన్-3 విజయంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను విజయవంతంగా దించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇస్రో మరింత వేగవంతమైన ప్రగతిని సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.