Loading...
NASA: అంగారకుడిపై తొలిసారి స్వచ్ఛమైన గంధకం గుర్తింపు.. నాసా పరిశోధనలో ఆసక్తికర విషయాలు
అంగారకుడిపై తొలిసారి స్వచ్ఛమైన గంధకం గుర్తింపు..

NASA: అంగారకుడిపై తొలిసారి స్వచ్ఛమైన గంధకం గుర్తింపు.. నాసా పరిశోధనలో ఆసక్తికర విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంగారకుడిపై జీవం ఉందా? అక్కడ గతంలో ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉండేవి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ నాసా ఎన్నో పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలో నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్‌కు అనుకోకుండా ఓ అరుదైన విషయం బయటపడింది. అంగారకుడిపై సాధారణ రాయిలా కనిపించిన ఓ బండరాయిని రోవర్ తన చక్రాలతో తొక్కి పగలగొట్టింది. దీంతో దాని లోపల నుంచి లేత పసుపు రంగులో ఉన్న స్ఫటికాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అవి స్వచ్ఛమైన గంధకం(ఎలిమెంటల్ సల్ఫర్)అని గుర్తించారు.అంగారకుడిపై ఈ రూపంలో గంధకం కనిపించడం ఇదే తొలిసారి. 2024 మే నెలలో క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై ఉన్న గేల్ క్రేటర్‌లోని గెడిజ్ వాలిస్ ఛానల్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తోంది.

వివరాలు 

అంగారకుడిపై స్వచ్ఛమైన గంధకం కనిపించడం మాత్రం ప్రత్యేకం 

ఈ సమయంలో 899 కిలోల బరువున్న రోవర్ ఓ రాయిపై నుంచి వెళ్లడంతో అది పగిలిపోయింది.

దాని లోపల పసుపు రంగు స్ఫటికాలు బయటపడ్డాయి. వాటిని విశ్లేషించిన పరిశోధకులు అవి స్వచ్ఛమైన గంధకమని నిర్ధారించారు.

అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఇలాంటి గంధకం ఉన్న మరికొన్ని రాళ్లు కూడా కనిపించడం శాస్త్రవేత్తల్లో ఆసక్తిని పెంచింది.

అంగారకుడిపై గంధకం ఆధారిత ఖనిజాలు ఉండటం కొత్త విషయమేమీ కాదు.

అయితే స్వచ్ఛమైన గంధకం కనిపించడం మాత్రం ప్రత్యేకమైన విషయం.

ఈ అరుదైన ఆవిష్కరణపై నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీకి చెందిన క్యూరియాసిటీ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త అశ్విన్ వాసవాడ స్పందిస్తూ.. ఎడారిలో నీటి ఒయాసిస్ కనిపించినంత ఆశ్చర్యంగా స్వచ్ఛమైన గంధకంతో కూడిన రాళ్ల ప్రాంతం కనిపించిందని పేర్కొన్నారు.

వివరాలు 

గంధకం ఎలా ఏర్పడింది?

ఇప్పుడు ఈ పసుపు రంగు నిక్షేపాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో 2026లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు కీలకమైన వివరాలను వెల్లడించాయి.

2026 జూన్‌లో సైన్స్ (Science) జర్నల్‌లో ప్రచురితమైన తొలి అధ్యయనం క్యూరియాసిటీ రోవర్ సేకరించిన సమాచారం, గంధకం ఉన్న రాళ్ల రసాయన లక్షణాలపై దృష్టి పెట్టింది.

ఈ పరిశోధన ప్రకారం.. స్వచ్ఛమైన గంధకం నిక్షేపాలు సుమారు 2,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి.

ఆ రాళ్లు సులభంగా పగిలిపోయే స్వభావం కలిగి ఉండటంతో అవి వేరే ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినవి కాకుండా అక్కడే ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

గంధకం ఎలా ఏర్పడింది?

ఈ నిక్షేపాలు ఏర్పడటానికి పురాతన అగ్నిపర్వతాల కార్యకలాపాలు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అగ్నిపర్వతాల నుంచి వెలువడిన వాయువులు అంగారకుడి ఉపరితలం కింద చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆ వాయువులు చల్లబడే సమయంలో క్లాథ్రేట్స్(మంచు లాంటి నిర్మాణాల్లో చిక్కుకున్న వాయువులు)రూపంలో నిలిచిపోయి ఉండవచ్చని చెబుతున్నారు.

బిలియన్ల సంవత్సరాల కాలంలో గాలి,ఇతర సహజప్రక్రియల వల్ల గెడిజ్ వాలిస్ ఛానల్ ప్రాంతంలో కోత ఏర్పడింది.

దీంతో భూగర్భంలో చిక్కుకున్న వాయువులపై ఒత్తిడితగ్గి అవి బయటకు వచ్చి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఆ తర్వాత జరిగిన రసాయన చర్యల కారణంగా స్వచ్ఛమైన గంధకం ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ నిక్షేపాలు సుమారు 310కోట్ల నుంచి 280కోట్ల సంవత్సరాల మధ్య ఏర్పడి ఉండవచ్చని అధ్యయనం సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

నీటితోనూ స్వచ్ఛమైన గంధకం ఏర్పడుతుందా?

2026 జులైలో జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ (Geophysical Research Letters) జర్నల్‌లో మరో అధ్యయనం ప్రచురితమైంది.

కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశాన్ని గుర్తించారు.

అధిక ఉష్ణోగ్రతలు లేదా జీవుల ప్రమేయం లేకుండానే నీటిలో జరిగే రసాయన చర్యల ద్వారా స్వచ్ఛమైన గంధకం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

దీని కోసం పరిశోధకులు ప్రయోగశాలలో సల్ఫైడ్, క్లోరేట్ పదార్థాలను ఆమ్ల స్వభావం ఉన్న నీటిలో కలిపి ప్రయోగాలు చేశారు.

సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఈ చర్య జరగ్గా.. చిన్న చిన్న పసుపు రంగు గంధకం స్ఫటికాలు ఏర్పడ్డాయి.

ఈ ప్రక్రియలో క్లోరేట్ పరిమాణం కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.

వివరాలు 

నీటితోనూ స్వచ్ఛమైన గంధకం ఏర్పడుతుందా?

తక్కువ మోతాదులో క్లోరేట్ ఉన్నప్పుడు స్వచ్ఛమైన గంధకం ఏర్పడగా.. ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు సల్ఫేట్లు ఏర్పడ్డాయని పరిశోధకులు తెలిపారు.

పురాతన కాలంలో అంగారకుడిపై కూడా ఇలాంటి రసాయన చర్యలు చాలా కాలం పాటు జరిగి ఉండవచ్చని, వాటి వల్ల పెద్ద మొత్తంలో గంధకం నిక్షేపాలు ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

అయితే ఈ రెండు అధ్యయనాలు గంధకం ఏర్పడటానికి గల అవకాశాలను మాత్రమే వివరిస్తున్నాయి. అసలు కారణం ఏమిటనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.

వివరాలు 

అంగారకుడిపై జీవం ఉందనడానికి ఇదే ఆధారమా?

గంధకం జీవులకు అవసరమైన ముఖ్యమైన రసాయన మూలకం.

భూమిపై జీవులు ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమైనో ఆమ్లాల తయారీ సహా అనేక జీవ ప్రక్రియల్లో గంధకాన్ని ఉపయోగిస్తాయి.

అందువల్ల అంగారకుడిపై స్వచ్ఛమైన గంధకం బయటపడటం శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా మారింది.

గతంలో ఆ గ్రహంపై జీవం ఉనికికి అవసరమైన రసాయన పదార్థాలు అందుబాటులో ఉండేవా? అనే ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడనుంది.

అయితే గంధకం కనిపించినంత మాత్రాన అంగారకుడిపై జీవం ఉందని నిర్ధారించలేం.

ముఖ్యంగా రెండో అధ్యయనంలో జీవుల ప్రమేయం లేకుండానే రసాయన చర్యల ద్వారా స్వచ్ఛమైన గంధకం ఏర్పడవచ్చని ప్రయోగాలతో చూపించారు.

వివరాలు 

అంగారకుడిపై జీవం ఉందనడానికి ఇదే ఆధారమా?

కాబట్టి ఈ ఆవిష్కరణను జీవం ఉనికికి ఆధారంగా భావించకూడదు. అయినప్పటికీ ఈ పరిశోధన అంగారకుడి గత చరిత్రను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారింది.

ఆ గ్రహంపై గతంలో ఎలాంటి భౌగోళిక మార్పులు జరిగాయి? అగ్నిపర్వతాల కార్యకలాపాలు ఎలా ఉండేవి? నీరు, రసాయన పదార్థాల మధ్య ఎలాంటి చర్యలు జరిగాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ ఆవిష్కరణ మరో కీలక ఆధారంగా నిలవనుంది.

ADVERTISEMENT