
NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా
ఈ వార్తాకథనం ఏంటి
ఖగోళ పరిశోధనల్లో మరో అద్భుత ఆవిష్కరణ చోటు చేసుకుంది.
మన సౌరకుటుంబానికి వెలుపల, ఓ చిన్న నక్షత్ర మండలంలో స్ఫటికాకార నీటి మంచు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా ధ్రువీకరించారు.
నాసా అభివృద్ధి చేసిన అధునాతన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఈ విశేషాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ 'నేచర్' సైన్స్ జర్నల్ ప్రచురించింది.
Details
HD 181327 చుట్టూ ధూళి, శిథిలాల వలయాల్లో నీటి ఆనవాళ్లు
ఈ స్ఫటికాకార నీటి మంచు, సూర్యుని తరహాలో ఉండే HD 181327 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ధూళి-శిథిలాల వలయంలో గుర్తించారు. భూమి నుంచి దాదాపు 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్రం వయసు కేవలం 2.3 కోట్ల సంవత్సరాలు మాత్రమే. ఇది మన సూర్యుడికంటే కొద్దిగా పెద్దది, ఎక్కువ వేడి కలిగి ఉంది. దాని చుట్టూ ఏర్పడిన వ్యవస్థ కూడా స్థూలంగా ఉండటం గమనార్హం. జేమ్స్ వెబ్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ నక్షత్రం చుట్టూ ఉన్న శిథిలాల వలయం మరియు నక్షత్రం మధ్య భాగంలో, మన కైపర్ బెల్ట్‌ను పోలిన ఖాళీ ఉంది.
Details
స్పష్టంగా కనిపించింది
నీటి మంచుతో పాటు, అది స్ఫటికాకారంగా ఉండటం కూడా స్పష్టంగా కనిపించిందని అధ్యయన బృందం ప్రధాన శాస్త్రవేత్త చెన్ గ్జీ తెలిపారు.
ఇది మన సౌరకుటుంబంలోని శని గ్రహ వలయాలు, కైపర్ బెల్ట్‌లోని మంచు వస్తువుల్లో కనిపించే మాదిరిగానే ఉందని చెప్పారు.
Details
శిథిలాల మధ్య జరుగుతున్న ఘాతాలు - నీటి మంచుకి మూలం
HD 181327 వ్యవస్థ చాలా చురుకుగా ఉండటం వల్ల, అక్కడి శిథిలాల వలయంలో నిరంతరం ఢీకొన్న ఘాతాలు జరుగుతున్నాయి.
ఈ ఘాతాల వల్ల విడుదలయ్యే సన్నని ధూళి రూపకంలో ఉన్న మంచు కణాలను జేమ్స్ వెబ్ గుర్తించింది.
ఈ పరిణామం గ్రహ వ్యవస్థల ఏర్పాటులో నీటి భూమికను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Details
యాదృచ్ఛికం కాదు - నీటి పంపిణీలో అనుబంధతలు
ఈ నక్షత్ర వ్యవస్థలో కనుగొన్న నీటి పంపిణీ విధానం, మన సౌర కుటుంబంలోని కైపర్ బెల్ట్‌లోని నీటి పంపిణీ విధానంతో పోలిస్తే అనేక సమానతలున్నాయి.
ఇది కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే నీటి మంచు ఈ వ్యవస్థ అంతటా సమానంగా విస్తరించి లేదు.
ఇది ప్రధానంగా చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. శిథిలాల చక్రం మధ్యభాగంలో మాత్రమే సుమారు 8 శాతం నీటి మంచు ఉన్నట్లు గుర్తించారు.
Details
జేమ్స్ వెబ్‌తోనే సాధ్యమైన ఆవిష్కరణ
గతంలో శిథిలాల చక్రాలలో మంచు ఉండవచ్చని ఊహించినా, దాన్ని గుర్తించగల సాంకేతిక పరిజ్ఞానం అప్పట్లో అందుబాటులో లేదు.
కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి శక్తివంతమైన పరికరాల వలనే ఈవిధంగా స్పష్టమైన ఆధారాలు లభించాయి.
HD 181327 దగ్గర లభించిన ఈ అద్భుతమైన ఆధారాలతో, పాలపుంత గెలాక్సీ అంతటా ఏర్పడుతున్న యువ గ్రహ వ్యవస్థలలో శిథిలాల చక్రాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఖగోళ పరిశోధనలకు కొత్త దారులు చూపించనుందని వారు ఆశిస్తున్నారు.