నాసా సైకీ మిషన్: సైకీ గ్రహశకలంపై నాసా ప్రయోగిస్తున్న కొత్త మిషన్.. తెలుసుకోవాల్సిన విషయాలు
అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా, సైకీ మిషన్ అనే సరికొత్త ప్రయోగాన్ని అక్టోబర్ 12వ తేదీన చేపట్టనుంది. సైకీ అనే గ్రహశకలాన్ని గురించి తెలుసుకోవడానికి సైకీ స్పేస్ క్రాఫ్ట్ ను నాసా పంపించనుంది. సైకీ అనే గ్రహశకలం మీద లోహాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ గ్రహశకలం వయస్సు, దాని ఉపరితలం ఎలా ఉందనే విషయాలు, దాని కూర్పు ఏ విధంగా ఉందనే విషయాలను అర్థం చేసుకోవడానికి సైకీ మిషన్ ని నాసా ప్రయోగిస్తోంది. సైకీ గ్రహశకలాన్ని అర్థం చేసుకోవడం వల్ల భూమి వంటి గ్రహాల ఏర్పాటు ఎలా జరిగిందనేది అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సైకీని గుర్తించిన శాస్త్రవేత్తలు
ఈ సైకీ గ్రహశకలం అంగారక గ్రహం(MARS), బృహస్పతి(JUPITER) మధ్య ఉంటుంది. సౌర కుటుంబం ఏర్పడిన కాలంనాటి అనేక వస్తువులు ఈ గ్రహశకలంపై ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలాంటి గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు గమనించలేదు. సైకీ గ్రహశకలాన్ని నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కనుగొన్నారు. నాసా పంపించే సైకీ మిషన్ సైకీ గ్రహశకలం చుట్టూ రెండు సంవత్సరాల పాటు తిరగనుంది. సైకీ గురించిన ప్రతీ సమాచారాన్ని ఇది సేకరించనుంది. ఈ సమాచారం ద్వారా బుధుడు(Mercury), శుక్రుడు(Venus), భూమి(Earth), అంగారక(Mars) గ్రహాల ఏర్పాటు ఎలా జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.