LOADING...
NASA: నాసా టెలిస్కోపును కాపాడేందుకు 'లింక్' వ్యోమనౌక ప్రయోగం
నాసా టెలిస్కోపును కాపాడేందుకు 'లింక్' వ్యోమనౌక ప్రయోగం

NASA: నాసా టెలిస్కోపును కాపాడేందుకు 'లింక్' వ్యోమనౌక ప్రయోగం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమి వాతావరణం వైపు వేగంగా దిగివస్తున్న స్విఫ్ట్ టెలిస్కోపును రక్షించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 'లింక్' అనే ప్రత్యేక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఈ వ్యోమనౌకను పెగాసస్ రాకెట్ సాయంతో అంతరిక్షంలోకి పంపారు. ప్రత్యేకంగా మార్పులు చేసిన ఒక విమానం దిగువ భాగం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఈ ప్రయోగం పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్ సమీపంలో నిర్వహించారు.

వివరాలు

'లింక్' అనే ప్రత్యేక వ్యోమనౌకను అభివృద్ధి..

విశ్వంలో సంభవించే గామా కిరణ విస్ఫోటాలు (Gamma-ray bursts), నక్షత్రాల పేలుళ్లు వంటి ఖగోళ సంఘటనలను పరిశీలించేందుకు నాసా 2004లో స్విఫ్ట్ టెలిస్కోపును కక్ష్యలో ప్రవేశపెట్టింది. అయితే ఇటీవల సంభవించిన సౌర తుపాన్ల ప్రభావంతో ఈ టెలిస్కోపు క్రమంగా తన కక్ష్యను కోల్పోయి, వేగంగా భూమి వాతావరణం వైపు దిగివస్తోంది. ప్రస్తుతం ఇది భూమికి సుమారు 360 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని నెలల్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించి పూర్తిగా దగ్ధమయ్యే ప్రమాదం ఉంది. ఈ విలువైన అబ్జర్వేటరీని రక్షించేందుకు నాసా 3 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కెటలిస్ట్ సంస్థకు అప్పగించింది. ఆ ఒప్పందంలో భాగంగా ఆ సంస్థ 'లింక్' అనే ప్రత్యేక వ్యోమనౌకను అభివృద్ధి చేసింది.

వివరాలు

సెప్టెంబర్ నెల నుంచి స్విఫ్ట్ టెలిస్కోపుతో ఖగోళ పరిశీలన..

ప్రయోగం అనంతరం ఈ వ్యోమనౌక కొన్ని వారాల పాటు అంతరిక్షంలో ప్రయాణించి, తనకు అమర్చిన మూడు రోబోటిక్ హస్తాల సహాయంతో స్విఫ్ట్ టెలిస్కోపుతో అనుసంధానమవుతుంది. అనంతరం తన ఇంజిన్ల శక్తిని వినియోగించి స్విఫ్ట్‌ను మరింత ఎత్తైన కక్ష్యలోకి తీసుకెళుతుంది. స్విఫ్ట్ టెలిస్కోపు కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచడమే నాసా ప్రధాన లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మొత్తం ప్రక్రియ విజయవంతంగా పూర్తైతే, సెప్టెంబర్ నెల నుంచి స్విఫ్ట్ టెలిస్కోపు తిరిగి ఖగోళ పరిశీలనలను ప్రారంభించనుంది.

Advertisement