అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం: వన్ ఇయర్ ప్రోగ్రామ్ ని మొదలెట్టిన నాసా
అంగారక గ్రహం మీద మానవుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అంగారక గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అంగారక గ్రహం పరిస్థితులను భూమీద సృష్టించి వ్యోమగాములకు అంగారక పరిస్థితులను అలవాటు చేయిస్తోంది. హ్యూస్టన్ నగరంలో జాన్సన్ స్పేస్ సెంటర్ లో అంగారక గ్రహం మాదిరి పరిస్థితులను కల్పిస్తున్నారు. అరుణ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ మిషన్ ని మిషన్-1 అని పిలుస్తున్నారు. ఈ మిషన్, 2023 జూన్ 25మొదలై, 2024 జులై 7న ముగుస్తుంది. సంవత్సరం పాటు అంగార గ్రహం లాంటి పరిస్థితుల్లోనే వ్యోమగాములు నివసిస్తారన్నమాట.
ఈ మిషన్ లో నలుగురు మనుషులు
ఈ మిషన్ లో నలుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో కెల్లీ హాట్సన్(క్రూ కమాండర్), రాస్ బ్రాక్ వెల్, నాథన్ జోన్స్, అంకా సేలరీ మెంబర్లుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ నలుగురు వ్యోమగాములు 1700చదరపు అడుగుల మార్స్ డూనే ఆల్ఫాలో నివసిస్తున్నారు. 3డీ ప్రింటింగ్ తో తయారైన ఈ ప్రాంతం ఎర్రటి ఇసుకతో కప్పబడి ఉంటుంది. మార్స్ డూనే ఆల్ఫాలో నివసించే వ్యోమగాములు, అప్పుడు బయటకు వచ్చి 12200చదరపు అడుగుల ఇసుక బాక్స్ లో మార్స్ వాక్స్ చేస్తారు. మార్స్ డూనే ఆల్ఫాలో ఒక కిచెన్, రెండు బాత్రూమ్స్, కొన్ని ప్రైవేటు క్వార్టర్లు ఉంటాయి. ఈ మిషన్ లో ఉండే వ్యోమగాములు డ్రై ఫుడ్ తీసుకుంటారు.
ఆరోగ్యం ఎలా ఉంటుందోనని ప్రయోగం
వ్యోమగాములు అందరూ మార్స్ డూనే ఆల్ఫా లో ఉంటే వారిని గమనిస్తూ బయట శాస్త్రవేత్తలు ఉంటారు. మార్స్ డూనే ఆల్ఫా నుండి ఏదైనా సమచారాన్ని బయట ఉన్న శాస్త్రవేత్తలకు చేరవేయడానికి 22నిమిషాల సమయం పడుతుంది. మార్స్ నుండి భూమికి ఏదైనా సమాచారం అందాలన్నా కూడా 22నిమిషాల సమయం పడుతుంది. అంగారక గ్రహంపై ఉండే గ్రావిటీ పరిస్థితులు మార్స్ డూనే ఆల్ఫాలో మాత్రం లేవు. ఈ ప్రయోగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మార్స్ మీద ఉండే పరిస్థితుల మనుషుల ఆరోగ్యాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయో తెలుసుకోవడం. అందుకే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవారినే ఈ మిషన్ కోసం ఎంచుకున్నారు.