NASA: మార్స్ మిషన్‌లో కీలక ఘట్టం.. పురాతన శిలల ప్రాంతానికి చేరిన పర్సివీరెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక గ్రహంపై పరిశోధనలు కొనసాగిస్తున్న నాసా పర్సివీరెన్స్ రోవర్ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని భూమికి పంపించింది. శాస్త్రవేత్తలు "లాక్ డి చార్మ్స్"గా పిలిచే ప్రాంతం నేపథ్యంగా తీసుకున్న ఈ సెల్ఫీ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. జెజీరో క్రేటర్‌ను దాటి తీసిన ఈ చిత్రం, రోవర్ దిగిన తర్వాత ఇప్పటివరకు పడమర దిశగా చేసిన అత్యంత దూర ప్రయాణానికి గుర్తుగా నిలిచింది. 2021లో మార్స్‌పై అడుగుపెట్టిన తర్వాత పర్సివీరెన్స్ తీసుకున్న ఆరవ సెల్ఫీ ఇదే కావడం విశేషం.
వివరాలు
నాసా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
దీనిపై నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త కేటీ స్టాక్ మోర్గాన్ మాట్లాడుతూ.. "జెజీరో క్రేటర్ అంచులను దాటి ఉన్న 'వైల్డ్ వెస్ట్' ప్రాంతంలో ఈ చిత్రాన్ని తీశాం. ఐదేళ్ల క్రితం ల్యాండింగ్ చేసిన తర్వాత మేము చేరుకున్న అత్యంత పడమర ప్రాంతం ఇదే" అని తెలిపారు. అలాగే "మేము 'అరేతూసా' అనే రాతి నిర్మాణాన్ని పరిశీలించి విశ్లేషణ పూర్తిచేశాం. ఆ సమయంలో రోవర్ ఉన్న ప్రదేశం నుంచి జెజీరో క్రేటర్ అంచులు, బయట ఉన్న భూభాగం రెండూ స్పష్టంగా కనిపించాయి" అని చెప్పారు.
వివరాలు
నాసా తెలిపిన వివరాలివే..
ఈ చిత్రాన్ని వివరిస్తూ నాసా తెలిపిన వివరాల ప్రకారం.. "మార్స్‌పై ఉన్న పర్సివీరెన్స్ రోవర్ సెల్ఫీ ఇది. 'అరేతూసా'గా పిలిచే రాతి నిర్మాణం పక్కన రోవర్ నిలిచి ఉంది. రోవర్‌తో పాటు చుట్టుపక్కల నేల ముదురు ఇసుక రంగులో కనిపిస్తుండగా, ఆకాశం పీచ్ రంగు ఛాయతో కనిపిస్తోంది" అని పేర్కొంది. నాసా వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ సెల్ఫీని మార్చి 11న చిత్రీకరించారు. పర్సివీరెన్స్ రోవర్‌కు అమర్చిన 7 అడుగుల రోబోటిక్ చేతి చివర ఉన్న వాట్సన్ కెమెరాతో మొత్తం 61 వేర్వేరు చిత్రాలు తీశారు.
వివరాలు
రోబోటిక్ కదలికలతో ఇమేజ్..
అనంతరం దాదాపు గంటపాటు 62 ఖచ్చితమైన రోబోటిక్ కదలికలతో వాటిని కలిపి ఈ ఫైనల్ కంపోజిట్ ఇమేజ్‌ను రూపొందించారు. ఈ చిత్రం ద్వారా అక్కడి పర్వత అంచులు, ప్రాచీన శిలల నిర్మాణాలపై శాస్త్రవేత్తలకు స్పష్టమైన అవగాహన లభిస్తోందని నాసా తెలిపింది. ఈ సందర్భంగా కాల్‌టెక్‌కు చెందిన పర్సివీరెన్స్ డిప్యూటీ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త కెన్ ఫార్లీ మాట్లాడుతూ.. "ఈ మిషన్‌లో మేము అధ్యయనం చేయబోయే అత్యంత పురాతన శిలలు ఇవే అయ్యే అవకాశముందని ఈ చిత్రాన్ని చూసి అనిపిస్తోంది" అని తెలిపారు.