నాసా వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించిన చారిక్లో అనే గ్రహశకలం
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి శాస్త్రవేత్తలు చారిక్లో అనే గ్రహశకలాన్ని దగ్గరగా చూడగలిగారు. 2013లో సుదూర నక్షత్రం ముందు చారిక్లో వెళుతుండగా కనిపించింది. మరో రెండు చిన్న వస్తువులు కూడా నక్షత్రం ఎదురుగా కనిపించాయి, అవి చారిక్లో వలయాలుగా తర్వాత గుర్తించారు. నాసా ఇప్పుడు వెబ్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహశకల చిత్రాన్ని పంచుకుంది. వెబ్ లో ఉన్న ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు చారిక్లో నక్షత్రం గయా DR3 6873519665992128512ను అక్టోబర్ 2022లో గమనించారు. నక్షత్ర ప్రకాశాన్ని జాగ్రత్తగా విశ్లేషించిన తరువాత, చారిక్లో గ్రహశకలం చుట్టూ ఉన్న వలయాలు ఉన్నాయని కనుగొన్నారని నాసా వెల్లడించింది.
చారిక్లో పరిమాణంలో భూమి కంటే 51 రెట్లు చిన్నది
చారిక్లో 250 కిలోమీటర్ల వెడల్పు ఉంది, ఇది భూమి కంటే 51 రెట్లు చిన్నది. దాని వలయాలు కేంద్రం నుండి 400 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ఉంటాయి. ఇది శని గ్రహ కక్ష్యకు 3.2 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రహశకలం చిన్నగా ఉండటం, దూరంగా ఉండటం వెబ్‌కి నేరుగా వలయాలను చిత్రించడం కష్టమయ్యింది. చారిక్లో వలయాలు గ్రహశకలంతో ఢీకొన్న శిధిలాలతో పాటు మంచుతో తయారు చేయబడతాయని నాసా అంచనా వేసింది. టెలిస్కోప్‌ల నుండి స్పెక్ట్రా ఈ మంచును సూచించింది. ఈ రెండు వలయాలపై పరిశోధన ద్వారా వీటి మందం, పరిమాణాలు, రంగులను కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని నాసా శాస్త్రవేత్త పాబ్లో శాంటోస్-సాన్జ్ అన్నారు.