NASA: రేపు సూర్యుడికి అత్యంత దగ్గరగా 'నాసా' పార్కర్
సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరిన స్పేస్‌క్రాఫ్ట్‌గా 'నాసా' రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ కొత్త చరిత్ర సృష్టించబోతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. అప్పటి నుంచి ఇది సూర్యుడి వైపుకు దీర్ఘ ప్రయాణం సాగిస్తోంది. మంగళవారం ఇది సూర్యుడి ఉపరితలం నుంచి 3.8మిలియన్ మైళ్లు(6మిలియన్ కిలోమీటర్లు)దూరంలోకి చేరనుంది. నాసా శాస్త్రవేత్త జో వెస్ట్‌లేక్ ఉదాహరణగా ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని పేర్కొంటూ,అక్కడ 4యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని చెప్పారు. ఇంతకముందు ఇలాంటి సమీప దూరానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఏదీ లేదు. సూర్యుడికి ఈ స్థాయిలో చేరిన తర్వాత,పార్కర్ నుంచి సమాచార ప్రసారం ఆగిపోతుందని,ఆ తర్వాత దాని స్థితి ఏవిధంగా ఉంటుందన్నది స్పష్టత లేదు.
1,371 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి తట్టుకోగలదు
క్షేమంగా తిరిగి వస్తుందా లేదా దాని మీద ఎటువంటి ప్రభావం పడుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు రూపొందించిన స్పేస్‌క్రాఫ్ట్‌లలో పార్కర్ అత్యంత వేగవంతమైనది, ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. సూర్యుడి అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోగలిగేలా, దీనికి బలమైన హీట్ షీల్డ్‌ను అమర్చారు, ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి తట్టుకుంటుంది. సూర్యుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఇదే కక్ష్యలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్య ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు వేడిగా ఉంటుంది అన్నది తెలుసుకోవడంలో ఈ మిషన్ కీలక సమాచారం అందిస్తుందని నాసా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.