LOADING...
NASA Spacecraft: సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. 'సురక్షితంగానే ఉంది': నాసా 
సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. 'సురక్షితంగానే ఉంది': నాసా

NASA Spacecraft: సూర్యుడికి అత్యంత దగ్గరగా పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌.. 'సురక్షితంగానే ఉంది': నాసా 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్యుడి పరిశోధన కోసం ప్రత్యేకంగా రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్ (Parker Solar Probe) పూర్తి సురక్షితంగా ఉందని నాసా (NASA) శుక్రవారం ప్రకటించింది. సూర్యుడి బాహ్య వాతావరణం, కరోనా, పై అధ్యయనం చేయడంలో భాగంగా శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకను పంపారు. సూర్యుడి అత్యంత సమీపానికి చేరినప్పుడు కొద్దిసేపు ఆ ప్రోబ్ నుంచి సంకేతాలు అందలేదు. అయినప్పటికీ, గురువారం రాత్రికి ఆ సంకేతాలు తిరిగి అందాయని జాన్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ వెల్లడించింది.

వివరాలు 

సూర్యుడికి అత్యంత దగ్గరగా ప్రయాణించిన తొలి వ్యోమ నౌక

డిసెంబర్ 24న పార్కర్ సోలార్ ప్రోబ్ సౌర ఉపరితలానికి కేవలం 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరానికి చేరి, సూర్యుడికి అత్యంత దగ్గరగా ప్రయాణించిన తొలి వ్యోమ నౌకగా చరిత్ర సృష్టించింది. జనవరి 1న ఈ ప్రోబ్ తన పరిశోధనలకు సంబంధించిన టెలిమెట్రీ డేటాను పంపుతుందని నాసా తెలిపింది. ఈ డేటా సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి కరోనా ప్రాంతంలోని కణాలు ఎందుకు మిలియన్ల డిగ్రీల వేడి చేర్చుకుంటాయో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రోబ్ను నాసా ఇతర పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలతో కలిసి రూపొందించింది. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం, పార్కర్ సోలార్ ప్రోబ్ 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్‌ (982 డిగ్రీల సెల్సియస్‌) ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.

వివరాలు 

2018లో నాసా ఈ ప్రోబ్‌ను ప్రయోగించింది,

దీనికి పటిష్ఠమైన ఉష్ణ కవచం ఉంటుంది. అయితే నమూనాల సేకరణకు అవసరమైన పరికరాలు మాత్రమే కవచం బయట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్‌, నియోబియం, మాలిబ్డినమ్‌, సఫైర్‌ వంటి పదార్థాలతో తయారు చేశారు. 2018లో నాసా ఈ ప్రోబ్‌ను ప్రయోగించింది, కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు చేయడం దాని ప్రధాన లక్ష్యం. ఈ ప్రోబ్ 2021 ఏప్రిల్ 28న తొలిసారి కరోనా ప్రాంతంలోకి ప్రవేశించింది.