LOADING...
NASA: ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో కూల్చనున్నారా? నాసా ప్రణాళిక వెనుక అసలు కారణాలివే!
ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో కూల్చనున్నారా? నాసా ప్రణాళిక వెనుక అసలు కారణాలివే!

NASA: ఐఎస్‌ఎస్‌ను సముద్రంలో కూల్చనున్నారా? నాసా ప్రణాళిక వెనుక అసలు కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనలకు కేంద్రంగా నిలిచిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) సేవలకు త్వరలో ముగింపు పలకనుంది. 2030 నాటికి ఈ భారీ అంతరిక్ష కేంద్రాన్ని భూ వాతావరణంలోకి నియంత్రిత పద్ధతిలో తీసుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? 450 టన్నుల బరువున్న ఈ నిర్మాణాన్ని సముద్రంలో పడేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

వివరాలు 

30 ఏళ్ల ప్రయాణం ముగింపుకు..

ఐఎస్‌ఎస్‌ నిర్మాణానికి 1998లో రష్యా శ్రీకారం చుట్టింది. అనంతరం అమెరికాతో పాటు పలు దేశాలు భాగస్వామ్యం కావడంతో 2000 నాటికి ప్రధాన నిర్మాణం పూర్తయింది. తర్వాత దశలవారీగా కొత్త మాడ్యూల్‌లు జోడిస్తూ దీనిని విస్తరించారు. గత మూడు దశాబ్దాలుగా ఈ అంతరిక్ష కేంద్రంలో అనేక కీలక శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయి. వైద్య రంగ పరిశోధనలతో పాటు అతి తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో పంటల పెరుగుదల, పదార్థాల లక్షణాల్లో వచ్చే మార్పులు, భూమి పరిశీలన వంటి ఎన్నో అధ్యయనాలకు ఐఎస్‌ఎస్‌ వేదికగా నిలిచింది.

వివరాలు 

ఎందుకు కూల్చేయాలని నిర్ణయం?

ఐఎస్‌ఎస్‌ తొలి మాడ్యూల్‌ను ప్రారంభించిన సమయంలో దీని సేవా కాలం కేవలం 15 సంవత్సరాలే ఉంటుందని భావించారు. అయితే వివిధ కారణాలతో ఇది దాదాపు రెట్టింపు కాలం పనిచేసింది. దీర్ఘకాల వినియోగం కారణంగా నిర్మాణ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నిర్వహణ, మరమ్మతుల ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో 2030 నాటికి ఐఎస్‌ఎస్‌ను నియంత్రిత పద్ధతిలో భూ వాతావరణంలోకి దించి సముద్రంలో కూల్చివేయాలని నాసా ప్రతిపాదించింది.

Advertisement

వివరాలు 

'ఉపగ్రహాల శ్మశానం'లోనే కూల్చివేత

ఐఎస్‌ఎస్‌ పరిమాణం చాలా భారీగా ఉంటుంది. దీని పొడవు సుమారు 358 అడుగులు,వెడల్పు 239 అడుగులు,ఎత్తు 66 అడుగులు. ఇలాంటి భారీ నిర్మాణాన్ని కూల్చడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. పొరపాటున జనావాసాలపై పడకుండా ఉండేందుకు నాసా పాయింట్‌ నీమో ప్రాంతాన్ని ఎంపిక చేసింది. కాలం చెల్లిన లేదా అదుపు తప్పిన ఉపగ్రహాలను సాధారణంగా ఈ ప్రాంతంలోనే సముద్రంలో పడేస్తుంటారు. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో,న్యూజిలాండ్,దక్షిణ అమెరికా మధ్య ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్య సముద్ర ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి నుంచి కనీసం 2,688 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాతే మానవ నివాసం కనిపిస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

Advertisement

వివరాలు 

పర్యావరణవేత్తల ఆందోళన

ఐఎస్‌ఎస్‌కు వెళ్లి వచ్చే వ్యోమగాములు కూడా ఈ ప్రాంతం సమీపంలోనే భూమిపై దిగుతుంటారు. ఒకవేళ కూల్చివేత సమయంలో శకలాలు విడిపోయినా అవి నిర్మానుష్య సముద్రంలోనే పడతాయనే అంచనాతో నాసా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. సుమారు 450 టన్నుల బరువున్న ఐఎస్‌ఎస్‌లో అనేక రకాల లోహాలు, ప్లాస్టిక్ పదార్థాలు, వివిధ రసాయన అవశేషాలు ఉన్నాయి. ఇవి సముద్రంలో కలిస్తే సముద్ర జీవవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రాన్ని వ్యర్థాలను పడేసే ప్రదేశంగా మార్చకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. ఐఎస్‌ఎస్‌ను పూర్తిగా కూల్చివేయడం కంటే, అందులో ఉపయోగించదగిన వ్యవస్థలు, ఇంజిన్లు, మోటార్లను మరమ్మతు చేసి తిరిగి వినియోగించాలని సూచిస్తున్నారు.

వివరాలు 

అంతర్జాతీయ నిబంధనలు ఏమంటున్నాయి?

అలాగే నిర్మాణాన్ని ఒకేసారి ధ్వంసం చేయకుండా, ఎలాగైతే ఒక్కో భాగాన్ని జోడిస్తూ ఐఎస్‌ఎస్‌ను నిర్మించారో, అదే విధంగా దశలవారీగా విడదీసి అత్యవసరంగా తొలగించాల్సిన భాగాలను మాత్రమే కూల్చాలని నిపుణులు సూచిస్తున్నారు. 1972లో రూపొందించిన స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ ప్రకారం, ఉపగ్రహ శకలాల వల్ల ఏ దేశానికైనా నష్టం జరిగితే ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు సముద్ర ప్రాంతాలకు వర్తించవు. అందుకే ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాల్లో మార్పులు అవసరమని వాషింగ్టన్‌కు చెందిన ది ఓషన్ ఫౌండేషన్ అధ్యక్షుడు మార్క్ స్పాల్డింగ్ అభిప్రాయపడుతున్నారు. మనుషులు నివసించని ప్రాంతమని చెప్పి సముద్రానికి విలువ లేదని భావించకూడదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఐఎస్‌ఎస్‌ను ఎలా కూల్చుతారు?

2028: ఐఎస్‌ఎస్‌ను భూమి వైపు తీసుకురావడానికి తొలి దశ ప్రారంభమవుతుంది. రష్యాకు చెందిన జార్యా మాడ్యూల్ సహాయంతో క్రమంగా కక్ష్యను తగ్గించి భూమి గురుత్వాకర్షణ ప్రభావంలోకి తీసుకువస్తారు. 2029: స్పేస్‌ఎక్స్ రూపొందిస్తున్న ప్రత్యేక డీ-ఆర్బిటింగ్ అంతరిక్ష నౌక ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమవుతుంది. ఇందులో అమర్చిన సుమారు 46 థ్రస్టర్ల సహాయంతో అంతరిక్ష కేంద్రాన్ని నియంత్రిత పద్ధతిలో పాయింట్ నీమో ప్రాంతానికి దారి మళ్లించి సముద్రంలో కూల్చివేస్తారు.

Advertisement