
NATGRID: నాట్‌గ్రిడ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
నాట్‌గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్.ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉండే ఒక సమగ్ర ఇంటెలిజెన్స్ డేటాబేస్ వ్యవస్థ. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ముందే గుర్తించి అడ్డుకునేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశంలోని అనేక కీలక నిఘా సంస్థలకు పౌరులపై ఆధారిత సమాచారాన్నిఈ వ్యవస్థ కొన్ని క్షణాల్లోనే అందించగలదు. ప్రతి పౌరునికి సంబంధించిన 21 రకాల సమాచార అంశాలు ఈ డేటాబేస్‌లో నమోదుగా ఉంటాయి. అనుమానితుల కదలికలపై ముందుగానే గమనించి,భవిష్యత్‌లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు నాట్‌గ్రిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. దాడి జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే,దాడి జరిగే అవకాశం ఉన్న దశలోనే స్పందించి చర్యలు తీసుకునే విధంగా ఇది పనిచేస్తుంది. కౌంటర్ టెర్రరిజం చర్యల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వివరాలు
నాట్‌గ్రిడ్ ఎప్పుడు రూపొందించారు?
భారత్ లో ముంబయి ఉగ్రదాడి జరిగిన 2008 నవంబర్ తరువాత, దేశంలో నిఘా వ్యవస్థలు మరింత బలంగా ఉండాల్సిన అవసరం స్పష్టమైంది. ఈ దాడికి ముందు తీవ్రవాదులు ఎన్నోసార్లు దేశంలోకి వచ్చి తిరిగినా, నిఘా సంస్థలు వారిని గుర్తించలేకపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పట్టించుకోకపోవడం, సంబంధిత శాఖల మధ్య సమాచార మార్పిడిలో లోపాలు కనిపించాయి. ఈ లోపాలను అధిగమించేందుకు కేంద్ర హోంశాఖ 2009 డిసెంబరులో నాట్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని నిఘా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచేందుకు ఒక శక్తివంతమైన ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తోంది.
వివరాలు
సమాచార మార్పిడికి వేదిక
నాట్‌గ్రిడ్ ప్రధానంగా 11 కీలకకేంద్ర సంస్థల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది. ఈసమాచార మార్పిడి అత్యంత రహస్యంగా,సురక్షితంగా జరుగుతుంది. ఇందులో పాల్గొనే సంస్థలు: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB),ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA),నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB),రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI),డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI),సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(CBEC),డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్(DGCEI),ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ఈ సంస్థలు మాత్రమే నాట్‌గ్రిడ్‌కు ప్రాప్యత కలిగి ఉంటాయి. ఇతర ఏ సంస్థలకూ దీనికి నేరుగా ప్రాప్తి ఉండదు.డేటాను హాక్ చేయకుండా పకడ్బందీగా ఈ వ్యవస్థను రూపొందించారు.
వివరాలు
ఏయే సమాచారం నాట్‌గ్రిడ్‌లో ఉంటుంది?
ప్రతి పౌరునికి సంబంధించిన 21 రకాల సమాచారాన్ని ఇది కలిగి ఉంటుంది. వాటిలో: ఫోన్ నెంబర్లు, కాల్ రికార్డులు ప్రస్తుతం వాడుతున్న, గతంలో వాడిన సిమ్ కార్డుల సమాచారం బ్యాంకింగ్ లావాదేవీలు, క్రెడిట్ కార్డు ఉపయోగాలు మనీ ట్రాన్స్‌ఫర్ వివరాలు స్టాక్ మార్కెట్ (సెబీ) ట్రాన్సాక్షన్స్ రైల్వే, విమాన, బస్సు ప్రయాణాలు టోల్ గేట్ల ద్వారా ప్రయాణ చరిత్ర ఇంటర్నెట్ సేవల వినియోగం వీసా, ఇమ్మిగ్రేషన్ వివరాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ డేటా ఈ సమాచారాన్ని సమీకరించి, విశ్లేషించి, అవసరమైన నిఘా సంస్థలకు అతి తక్షణమే అందించగల సామర్థ్యం నాట్‌గ్రిడ్‌కు ఉంది.
వివరాలు
నాట్‌గ్రిడ్ డేటాను నిల్వ చేయదు
గమనించదగ్గ విషయం ఏమిటంటే, నాట్‌గ్రిడ్ డేటాను నిల్వ చేయదు. ఇది వివిధ డేటాబేస్‌ల నుండి డేటాను తాత్కాలికంగా తీసుకుని సమన్వయం చేస్తుంది. మొదట్లో రాష్ట్రాలకు ఈ వ్యవస్థను అందించలేదు. కానీ ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్లకు లాగిన్ వివరాలు ఇచ్చి, వారు మాత్రమే నాట్‌గ్రిడ్‌ను యాక్సెస్ చేయగలిగేలా మార్పులు చేశారు.