న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్
మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది. అధునాతన బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ సాంకేతికతో నిర్వహించనున్న మొదటి ఇన్-హ్యూమన్ క్లినికల్ పరీక్షకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలోన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమ ఫస్ట్-ఇన్-హ్యూమన్ క్లినికల్ స్టడీని ప్రారంభించడానికి తమకు ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లు తెలియజేడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్ కోసం త్వరలో మనుషులను ఎంపిక చేయనున్నారు.
కోతులు, పందుల్లో క్రినికల్ ట్రయల్స్ విజయవంతం
మనిషి మెదడులో చిప్ అమర్చి, దాన్ని కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడమే లక్ష్యంగా తమ న్యూరాలింక్ సంస్థ ఈ పరీశోధనలు చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన న్యూరాలింక్ సమావేశంలో మస్క్ ఈ విషయాన్ని తెలిపారు. తాము మొదటి ఇంప్లాంట్ కోసం సిద్ధంగా ఉండటానికి చాలా కష్టపడుతున్నామని, మనిషి మెదడులో ఉంచే ఈ చిప్ చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా పని చేస్తుందని నమ్ముతున్నట్లు ఆ సమయంలో మస్క్ వెల్లడించారు. నాణెం పరిమాణంలో ఉండే న్యూరాలింక్ ప్రోటోటైప్‌లను కోతుల మెదడులో ఇప్పటికే అమర్చి, ప్రదర్సించారు. ఈ క్రమంలో కోతులు వీడియో గేమ్‌లు ఆడిన దృశ్యాలు అందరినీ ఆశ్చపర్చాయి. పందుల్లో కూడా సాంకేతికతను విజయవంతంగా పరీక్షించారు.