LOADING...
Novartis: భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ 'ప్లువిక్టో' ప్రారంభం.. ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక అడుగు
ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక అడుగు

Novartis: భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ 'ప్లువిక్టో' ప్రారంభం.. ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక అడుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
09:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ ఔషధ సంస్థ నోవార్టిస్ ఇండియా,అధునాతన ప్రొస్టేట్ క్యాన్సర్ రోగుల కోసం 'ప్లువిక్టో' (Pluvicto)అనే వినూత్న చికిత్సను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తొలి రేడియోలిగాండ్ థెరపీ (ఆర్‌ఎల్‌టీ)గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. పీఎస్‌ఎంఏ-పాజిటివ్ (PSMA-positive) ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స కొత్త ఆశలు కల్పిస్తోంది. సాధారణ చికిత్సలతో పోలిస్తే, ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఎక్కువగా ప్రభావితం చేయకుండా నేరుగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే విధంగా ఈ థెరపీ రూపొందించారు. దీంతో వ్యాధి పురోగతిని నెమ్మదింపజేయడమే కాకుండా, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

పురుషుల్లో క్రమంగా పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు

భారత్‌లో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇది అత్యంత సాధారణంగా కనిపించే మూడు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా మారింది. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2.5 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, దాదాపు సగం మంది రోగులకు వ్యాధి మెటాస్టాటిక్ లేదా చివరి దశకు చేరుకున్న తర్వాతే నిర్ధారణ అవుతోంది. దీంతో చికిత్స మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్లువిక్టో వంటి ఆధునిక చికిత్సల అవసరం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నోవార్టిస్ ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల హెడ్ జుడిత్ లవ్ మాట్లాడుతూ.. భారత్ తమ సంస్థకు అత్యంత కీలకమైన మార్కెట్ అని తెలిపారు.

వివరాలు 

దేశంలో వేగంగా విస్తరిస్తున్నప్రెసిషన్ ఆంకాలజీ,అధునాతన క్యాన్సర్ చికిత్సలు

దేశంలో ప్రెసిషన్ ఆంకాలజీ, అధునాతన క్యాన్సర్ చికిత్సలు వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్లువిక్టో వంటి అంతర్జాతీయ స్థాయి వైద్య ఆవిష్కరణను భారత రోగులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. అలాగే, దేశంలో అభివృద్ధి చెందుతున్న న్యూక్లియర్ మెడిసిన్ మౌలిక సదుపాయాలు ఈ చికిత్సను మరింత మంది రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. నోవార్టిస్ ఇండియా కంట్రీ ప్రెసిడెంట్,మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ దూబే మాట్లాడుతూ.. భారత్‌లో చాలా మంది ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారని తెలిపారు. దీనివల్ల చికిత్సా అవకాశాలు పరిమితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లువిక్టో ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రేడియోలిగాండ్ థెరపీని భారత వైద్య రంగానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు.

Advertisement

వివరాలు 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 250కిపైగా న్యూక్లియర్ మెడిసిన్ కేంద్రాలు

ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి ఈ చికిత్సను ఎక్కువ మంది రోగులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 250కిపైగా న్యూక్లియర్ మెడిసిన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని నోవార్టిస్ తెలిపింది. ఈ కేంద్రాల సహకారంతో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్లువిక్టో చికిత్సను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అలాగే క్యాన్సర్ నిపుణులు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్యులతో కలిసి ప్రెసిషన్ ఆంకాలజీపై అవగాహన పెంచడంతో పాటు, ఆధునిక చికిత్సలను మరింత విస్తృతంగా అందించే దిశగా చర్యలు చేపడతామని సంస్థ వెల్లడించింది.

Advertisement