ISRO: నిర్దేశిత కక్ష్య చేరని ఎన్‌వీఎస్-02.. ఇస్రో ప్రయోగం విఫలమా?
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల క్రితం నింగిలోకి ప్రయాణించిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో స్థాపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ వైఫల్యం ఉపగ్రహంలోని ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడం వల్ల ఏర్పడినట్లు తెలిసింది. భారత ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో ఎన్‌వీఎస్-02 కీలకమైన భూమిక పోషిస్తుంది.
ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా గత నెల 29న నింగిలోకి పంపారు.
ఈ ప్రయోగం ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Details
ప్రత్నామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్న ఇస్రో
ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని లక్ష్య కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో తాజాగా మరికొన్ని ప్రయత్నాలు చేసింది.
ఇందుకోసం శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపించి అవి ప్రజ్వరిల్లేలా చేయాల్సి ఉంది. అయితే ఆక్సిడైజర్‌ను ఇంజిన్లకు సరఫరా చేసే వాల్వ్‌లు తెరుచుకోకపోవడంతో ఇంజిన్లు పని చేయలేదు.
ప్రస్తుతం ఈ ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది.
కానీ ఈ కక్ష్య నావిగేషన్ వ్యవస్థ కార్యకలాపాలకు అనుకూలంగా లేదు. దీంతో ఇస్రో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.