OpenAI: డ్రగ్స్ వాడకంపై చాట్‌జీపీటీ సూచనలు.. యువకుడి మృతితో ఓపెన్‌ఏఐపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐపై సంచలన కేసు నమోదైంది. చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనల కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని 19 ఏళ్ల సామ్ నెల్సన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డ్రగ్స్‌ను ఎలా సురక్షితంగా వాడాలనే విషయంపై సామ్ చాట్‌జీపీటీని సంప్రదించగా, అది "అక్రమ డ్రగ్ కోచ్"లా వ్యవహరించిందని కేసులో పేర్కొన్నారు. ముఖ్యంగా క్రాటమ్‌తో పాటు తక్కువ మోతాదులో జానాక్స్ తీసుకుంటే మత్తు ప్రభావం పెరుగుతుందని, వాంతుల సమస్య తగ్గుతుందని చాట్‌జీపీటీ సూచించిందని ఆరోపించారు. అయితే ఈ మిశ్రమం వల్ల ప్రాణాపాయం ఉండొచ్చనే హెచ్చరిక ఇవ్వలేదని తెలిపారు.
వివరాలు
ChatGPT Health సేవలను నిలిపివేయాలని డిమాండ్
ఈ ఆరోపణలను ఓపెన్‌ఏఐ ఖండించింది. చాట్‌జీపీటీ వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ ఘటనలో ప్రస్తావించిన పాత మోడల్ ప్రస్తుతం అందుబాటులో లేదని తెలిపింది. అయినప్పటికీ, యువకుడికి మత్తు పదార్థాల వినియోగ సమస్య ఉందని గుర్తించిన తర్వాత కూడా చాట్‌జీపీటీ "డ్రగ్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవడం"పై సూచనలు ఇచ్చిందని కేసులో పేర్కొన్నారు. ప్రస్తుతం సామ్ తల్లిదండ్రులు నష్టపరిహారంతో పాటు చాట్‌జీపీటీలో అక్రమ డ్రగ్స్‌కు సంబంధించిన చర్చలను పూర్తిగా నిలిపివేయాలని కోర్టును కోరుతున్నారు. అంతేకాదు, పాత GPT-4o మోడల్‌ను తొలగించాలని, స్వతంత్ర ఆడిట్ పూర్తయ్యే వరకు ChatGPT Health సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.