Loading...
X Parental Controls: 20 ఏళ్ల తర్వాత ఎక్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్.. టీనేజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్!
20 ఏళ్ల తర్వాత ఎక్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్.. టీనేజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్!

X Parental Controls: 20 ఏళ్ల తర్వాత ఎక్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్.. టీనేజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విటర్) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 ఏళ్ల ప్రస్థానం తర్వాత తొలిసారిగా టీనేజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ (Parental Controls) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలు ఎక్స్‌లో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ప్లాట్‌ఫామ్‌పై ఎంత సమయం గడుపుతున్నారు? వంటి అంశాలను నియంత్రించేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు భిన్నంగా టీనేజర్లకు కూడా తమ అకౌంట్లపై కొంత నియంత్రణ ఉండేలా ఎక్స్ ఈ ఫీచర్‌ను రూపొందించింది.

వివరాలు

13-17 ఏళ్ల వారికి డిఫాల్ట్‌గా ప్రొటెక్టెడ్ మోడ్

13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారి ఎక్స్ అకౌంట్లు డిఫాల్ట్‌గా 'ప్రొటెక్టెడ్ మోడ్‌'లో ఉంటాయి. దీని ద్వారా వారు సున్నితమైన కంటెంట్‌ను చూడలేరు.

అలాగే వారికి వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా టార్గెటెడ్ ప్రకటనలు కూడా కనిపించవు.

తమ అకౌంట్లలో తల్లిదండ్రులు విధించిన పరిమితులు ఏమిటో టీనేజర్లు స్వయంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది.

అయితే పిల్లల ప్రైవేట్ మెసేజ్‌లను చదవడం, వారి సెర్చ్ లేదా వ్యూయింగ్ హిస్టరీని చూడటం, వారి తరఫున పోస్టులు చేయడం వంటి అధికారాలను తల్లిదండ్రులకు ఎక్స్ ఇవ్వలేదు.

అంటే పిల్లల భద్రతతో పాటు వారి వ్యక్తిగత గోప్యతకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది.

వివరాలు

పేరెంటల్ కంట్రోల్స్‌తో ఏమేం చేయొచ్చు?

కొత్త ఫీచర్ ద్వారా తల్లిదండ్రులకు పలు నియంత్రణలు అందుబాటులోకి వచ్చాయి.

తమ పిల్లలు వారానికి ఎక్స్‌లో ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవచ్చు.

రోజువారీ వినియోగానికి సమయ పరిమితులు విధించవచ్చు.

కొత్త ఫాలోవర్లను ఆమోదించేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయవచ్చు.

ఇప్పటికే ఫాలో అవుతున్న అకౌంట్లకు సంబంధించిన పోస్టులు, వీడియోలకే ఫీడ్ సిఫార్సులను పరిమితం చేయవచ్చు.

నిర్దిష్ట పదాలను ఫిల్టర్ చేయవచ్చు.

సున్నితమైన ఫొటోలు, వీడియోలు కనిపించకుండా నిలిపివేయవచ్చు.

పిల్లలకు ఎవరు డైరెక్ట్ మెసేజ్‌లు (DMs) పంపవచ్చో నియంత్రించవచ్చు.

పిల్లలు ఎవరితో మెసేజ్‌లు చేస్తున్నారో తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

గ్రోక్ వివాదాల తర్వాత కీలక నిర్ణయం

ఎక్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్ తీసుకురావడం వెనుక గతంలో ఎదురైన విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా ఎక్స్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (Grok) ద్వారా మహిళలు, చిన్నారులకు సంబంధించిన లైంగిక అభ్యంతరకర చిత్రాలను రూపొందించడంపై ఈ ఏడాది జనవరిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

చిన్నారులకు సంబంధించిన లైంగిక వేధింపుల కంటెంట్, తప్పుడు సమాచారం, ఏఐ బాట్స్‌తో పాటు అశ్లీల కంటెంట్‌కు కూడా ఎక్స్ వేదికగా మారిందనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

2024 జూన్‌లో ఎక్స్ తన నిబంధనలను సవరించి, కొన్ని షరతులకు లోబడి అడల్ట్ కంటెంట్ పోస్టింగ్‌ను అధికారికంగా అనుమతించింది.

దీంతో టీనేజర్లకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

ADVERTISEMENT

వివరాలు

జెన్ ఆల్ఫా పిల్లల్లోనూ ఎక్స్ వినియోగం!

సాధారణంగా టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ పనిచేయకపోయినా, చిన్న వయసు పిల్లలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

2024లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. జెన్ ఆల్ఫా (Gen Alpha)పిల్లల్లో దాదాపు మూడో వంతు మందికి ఎక్స్ అకౌంట్లు ఉన్నట్లు తేలింది.

ప్లాట్‌ఫామ్ నిబంధనల ప్రకారం కనీసం 13 ఏళ్లు నిండిన వారే అకౌంట్లు తెరవాలి.

ఈ కొత్త ఫీచర్‌పై ఎక్స్ సేఫ్టీ విభాగం అధిపతి మైఖేల్ ఓ'హెర్లిహీ స్పందిస్తూ.. తల్లిదండ్రులకు ఆచరణాత్మక నియంత్రణ సాధనాలు అవసరమని, అదే సమయంలో టీనేజర్లకు ఎదిగే స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నారు.

కుటుంబాలకు అనుగుణంగా పరిమితులు విధించుకునే అవకాశం కల్పిస్తూనే, టీనేజర్లు తమ అకౌంట్లపై యాజమాన్యాన్ని కొనసాగించేలా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

ADVERTISEMENT