
Password from hell: ఒక చిన్న పాస్‌వర్డ్ లోపంతో.. హ్యాకర్ల దాడిలో బలైపోయిన 158 ఏళ్ల కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద విధ్వంసానికి కారణమవుతుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఘటన మరోసారి నిరూపించింది. సుమారు 158 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ, ఇటీవల ఎదుర్కొన్న తీవ్రమైన సైబర్ దాడి కారణంగా పూర్తిగా మూతపడింది. ఈ సంఘటన కారణంగా 700 మంది ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. ఇది అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. శక్తివంతమైన బ్రాండ్ పతనం యూకేలో KNP లాజిస్టిక్స్ సంస్థ విశ్వసనీయమైన రవాణా సంస్థగా మంచి పేరు సంపాదించింది. 'ది నైట్స్ ఆఫ్ ఓల్డ్' పేరుతో సుమారు 500 ట్రక్కులను నిర్వహిస్తూ రవాణా రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.
వివరాలు
అకిరా గ్యాంగ్ దాడి.. డేటా బందీ
కంపెనీకి సైబర్ బీమా ఉన్నా కూడా,అకిరా గ్యాంగ్ చేసిన సైబర్ దాడి నుంచి రక్షణ పొందడంలో విఫలమైంది. ప్రఖ్యాత అకిరా హ్యాకింగ్ గ్యాంగ్, KNP సంస్థ సిస్టమ్‌ల్లో చొరబడి డేటాను ఎన్‌క్రిప్ట్ చేసింది. దీనివల్ల సంస్థ ఉద్యోగులు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. హ్యాకర్లు డేటాను తిరిగి విడుదల చేయాలంటే భారీగా రాన్సమ్ ధనం డిమాండ్ చేశారు. "మీరు ఈ సందేశం చదువుతున్నారంటే మీ అంతర్గత సమాచారం పూర్తిగా నాశనం అయిందని అర్థం. కన్నీళ్లతో చర్చలకు సిద్ధమవ్వండి" అంటూ హ్యాకర్లు బెదిరింపు సందేశాన్ని పంపారు.
వివరాలు
సైబర్ భద్రతపై ప్రశ్నలు
నిపుణుల అంచనా ప్రకారం, హ్యాకర్లు సుమారు 5 మిలియన్ పౌండ్లు (రూ. 58 కోట్ల రూపాయలు) డిమాండ్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ మొత్తం చెల్లించలేక KNP సంస్థ చివరకు మూతపడే పరిస్థితికి చేరుకుంది. KNP సంస్థ డైరెక్టర్ పాల్ అబాట్ ప్రకారం,హ్యాకర్లు ఉద్యోగుల లాగిన్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి సంస్థ సిస్టమ్‌ల్లోకి ప్రవేశించారని గుర్తించారు. అయితే ఏ ఉద్యోగి వివరాలు లీకయ్యాయనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ దాడిపై స్పందించిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) సీఈఓ రిచర్డ్ హోర్నె మాట్లాడుతూ, "ఈ డిజిటల్ యుగంలో కంపెనీలు భద్రతపై ఎక్కువ శ్రద్ధ పెట్టి తమ సిస్టమ్‌లను మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలి" అని హితవు పలికారు.
వివరాలు
ప్రపంచానికి మరోసారి హెచ్చరి
ఇలాంటి సైబర్ దాడులకు గతంలో యూకేలోని ఎం అండ్ ఎస్, కో-ఆప్, హారోడ్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా బలయ్యాయి. ప్రత్యేకంగా, కో-ఆప్ సంస్థకు చెందిన 6.5 మిలియన్ల మంది కస్టమర్ల డేటా హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైంది. ఈ సంఘటన మళ్లీ ప్రపంచాన్ని సైబర్ భద్రత ప్రాముఖ్యత గురించి చైతన్యపరిచింది. ఒక చిన్న పాస్‌వర్డ్ లోపం వల్లే వందలాది మంది ఉద్యోగుల జీవితం ప్రభావితమవడం చూస్తే, డిజిటల్ ప్రపంచంలో భద్రత ఎంత కీలకమో స్పష్టమవుతోంది. 158 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగిన KNP సంస్థను ఒక్క సైబర్ దాడి నేలకూల్చిన తీరు, ఇప్పుడు ప్రపంచానికి మరోసారి హెచ్చరికగా మారింది.