Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనే విద్యుత్, మొబైల్, గ్యాస్ బిల్లుల చెల్లింపు.. త్వరలోనే అందుబాటులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ త్వరలో తన ప్లాట్‌ఫామ్‌లో 'బిల్ పేమెంట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది.
ఈ ఫీచర్ ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం రూపొందించారని నిపుణులు చెబుతున్నారు.
వాట్సాప్‌ను మరింత రిచ్ ఫీచర్లతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
దీని ద్వారా ప్రజలు తమ యుటిలిటీ బిల్లులను వాట్సాప్ ద్వారానే చెల్లించే అవకాశం కలుగుతుంది. భారతదేశంలో 500 మిలియన్లకు పైగా యూజర్లకు ఇది భారీ అప్‌డేట్ అని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో పరీక్షల దశలో ఉంది.
Details
ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం
ఈ వాట్సాప్ బిల్ పేమెంట్ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, ఎల్‌పీజీ గ్యాస్ చెల్లింపులు, వాటర్ బిల్లులు, అద్దె చెల్లింపులు, ల్యాండ్‌లైన్ బిల్లులు వంటి అనేక చెల్లింపులను వాట్సాప్ యాప్ ద్వారానే చేయొచ్చు.
ముఖ్యంగా సాధారణ వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వాట్సాప్ భారతదేశంలో యూపీఐ ద్వారా కాంటాక్ట్‌లకు డబ్బు పంపడానికి, వ్యాపారాలకు చెల్లింపులు చేయడానికి అనుమతిస్తోంది.
ఇకపై ఈ బిల్ చెల్లింపు వ్యవస్థ వాట్సాప్ ఆర్థిక సేవలకు పొడిగింపుగా మారనుంది. అయితే ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత లేదు.
ఈ ఫీచర్ 2025 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.