PhonePe: ఫోన్‌పే వాలెట్ ఏడాది పాటు వాడలేదా? నిర్వహణ రుసుము వసూలుకు కంపెనీ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం వినియోగదారుల్లో చర్చకు దారితీసింది. గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని ఫోన్‌పే వాలెట్‌లపై నిర్వహణ రుసుము విధించనున్నట్లు సంస్థ వినియోగదారులకు సందేశాలు పంపుతోంది. దీంతో పలువురు యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తమకు వచ్చిన నోటిఫికేషన్‌లను కూడా పోస్టు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ఏ కారణంతో ఈ రుసుము?
ఫోన్‌పే పంపిన సమాచారంలో పేర్కొన్న వివరాల ప్రకారం, వరుసగా 12 నెలల పాటు ఎలాంటి డిజిటల్ లావాదేవీలు జరగని వాలెట్‌లను 'ఇన్‌యాక్టివ్ వాలెట్‌లు'గా పరిగణిస్తారు. అలాంటి వాలెట్‌లపై నిర్వహణ ఛార్జీల పేరుతో ప్రతి మూడు నెలలకు రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ విధానాన్ని ఇప్పటికే కంపెనీ తన టర్మ్స్ అండ్ కండీషన్స్‌లో కూడా చేర్చింది. అయితే, మూడు నెలలకు ఒకసారి ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నప్పటికీ, అందులో నిర్దిష్ట మొత్తాన్ని వెల్లడించలేదు. రుసుము అమలుకు 15 రోజుల ముందు వినియోగదారులకు నోటిఫికేషన్ పంపిస్తామని, ఆ వ్యవధిలో వాలెట్‌ను మళ్లీ యాక్టివ్‌గా మార్చుకుంటే అదనపు ఛార్జీలు ఉండవని కంపెనీ స్పష్టం చేసింది.
వివరాలు
వినియోగదారుల అభ్యంతరాలు..
ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులకు ఫోన్‌పే విస్తృతంగా వినియోగంలో ఉంది. ఎక్కువ మంది వినియోగదారులు యూపీఐ సేవల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, కొందరు యూజర్లు ఫోన్‌పే యూపీఐ లైట్‌ను వాలెట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా ఫోన్‌పే వాలెట్‌ను నేరుగా ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని భావిస్తున్నారు. చాలామందికి చివరిసారిగా వాలెట్‌ను ఎప్పుడు ఉపయోగించారో కూడా గుర్తులేని పరిస్థితి ఉంది. అలాంటి వాలెట్‌లపై కేవలం వినియోగం లేకపోయిందనే కారణంతో నిర్వహణ రుసుము విధించడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది వినియోగదారులపై అదనపు భారం మోపే చర్యగా విమర్శిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఎన్‌పీసీఐను ట్యాగ్ చేస్తూ ఫోన్‌పే నిర్ణయంపై స్పందించాలని కోరుతున్నారు. ఈవిధానాన్ని పునఃపరిశీలించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.